కొవిడ్ మహమ్మారి ప్రభావంతో అన్ని రంగాల కంటే ముందుగా దెబ్బతిన్న వాటిలో పర్యటకం ఒకటని చెప్పాలి. కొవిడ్ ప్రారంభమైన రోజుల నుంచే అంతర్జాతీయ పర్యటకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా టూర్ ఆపరేటర్లు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. జనవరి నుంచి ప్రారంభమైన పతనం ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయం అర్థం కాక పర్యటక ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. మన రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది వరకు టూర్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత్లో ఉన్న కొవిడ్ కేసుల ప్రభావంతో విదేశీ పర్యటకాన్ని ఇప్పట్లో ఆశించలేమని వారు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని దేశీయ పర్యటకాన్ని అయినా ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని వారు కోరుతున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యటకుల కోసం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్న వారికి ఆయా రాయితీలు వర్తించేలా విధానాన్ని రూపొందించింది. అదే తరహాలో ఇతర రాష్ట్రాలు చర్యలు చేపట్టి దేశీయ పర్యటకాన్ని ప్రోత్సహిస్తే ఈ రంగంపై ఆధారపడిన లక్షల మందికి తిరిగి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. టెంపుల్ టూరిజంకు ప్రస్తుతం ఆదరణ బాగానే ఉన్నందున దీనిపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆపరేటర్లు కోరుతున్నారు. సీజనల్ టూరిజంను కోల్పోకుండా ముందస్తు అప్రమత్తతతో విధానాన్ని రూపొందించాలని సూచిస్తున్నారు.