విశాఖ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువవుతోంది. రోజుకు సగటున 900 కేసులు నమోదు అవుతున్నాయి. డిశ్ఛార్జ్ సంఖ్య కొంత మెరుగవగా.. ప్రతిరోజు సగటున 800 నుంచి 900 మధ్య ఉంటోంది. మరణాల సంఖ్య కూడా సగటున 5 నుంచి 7 వరకు ఉంది. ఈ గణాంకాలు ఒక రకమైన మంచి పరిణామాలు సూచిస్తున్నాయి.
విశాఖ నగరంలో 17 ఆసుపత్రులు, 22 కేంద్రాలు కోవిడ్ బాధితులకు అండగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే 150 వరకు వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడటంలో జిల్లా యంత్రాంగం పెడుతున్న ప్రత్యేక దృష్టి కొంతవరకు ఫలితాలిస్తోంది. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా విమ్స్‌ను ప్రకటించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయని స్థానికులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ పలు మార్లు సందర్శించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.