ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు వైద్యం

విశాఖ జిల్లా ఎలమంచిలి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక యువకుడికి ఆపరేషన్ చేయడానికి రూ 30 వేలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. పేదలకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులతో కలసి వ్యాపారం చేస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు వైద్యం
ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు వైద్యం

By

Published : Feb 2, 2021, 1:13 PM IST

యలమంచిలిలోని ప్రభుత్వాసుపత్రిని తమ సొంత ఆసుపత్రిగా మార్చేసి జేబులు నింపుకొంటున్న కొందరు వైద్యులపై రోగులు సోమవారం తిరగబడ్డారు. ఎస్‌.రాయవరానికి చెందిన మూర్తి శివ అనే విద్యార్థికి ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయడానికి రూ.30 వేలకు వైద్యులు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఎస్‌.రాయవరానికి చెందిన మూర్తి శివ ఇంటర్‌ పూర్తి చేశాడు. మూడు రోజుల కిందట కడుపునొప్పి రావడంతో ఆర్‌ఎంపీకి చూపించారు. స్కానింగ్‌లో అపెండిసైటిస్‌ అని తేలడంతో వెంటనే ఆపరేషన్‌ చేయించాలని కుటుంబ సభ్యులకు ఆర్‌ఎంపీ సూచించారు.

ఇందుకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని చెప్పడంతో, అంత భరించలేమని శివ తాత సన్యాసిరావు ఆర్‌ఎంపీని బతిమాలాడారు. దీంతో రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. ఈయన శివను ఆపరేషన్‌ కోసం ఆదివారం ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. అడ్వాన్స్‌గా రూ. 17 వేలు తీసుకున్నాడు. ఆర్‌ఎంపీ వైద్యుడు, ఆసుపత్రి వైద్యాధికారిణి శ్రీలక్ష్మి కలసి విశాఖ నుంచి ఒక సర్జన్‌ను తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో ఆపరేషన్‌ చేయించారు. ఆసుపత్రిలోనే ఇన్‌ పేషెంట్‌గా ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.

శివప్రసాద్‌ మిగిలిన బ్యాలెన్స్‌ డబ్బులతోపాటు అదనంగా ఇమ్మని డిమాండ్‌ చేయడంతో రోగి బంధువులు సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయిస్తున్నామని ముందుగా తమకు చెప్పలేదని ఇప్పుడు అదనంగా డబ్బులు అడగడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మందులు ఆపరేషన్‌ సామగ్రి ఉపయోగించి ఆసుపత్రిలో వైద్యసిబ్బంది సేవలు పొంది ఇంత ఎక్కువ డబ్బులు వసూళ్లు చేయడం ఏమిటని రోగి తాత మూర్తి సన్యాసిరావు నిలదీశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎస్‌.రాయవరం గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబుకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై వైద్యాధికారిణి శ్రీలక్ష్మిని వివరణ కోరగా విశాఖ నుంచి ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిని రప్పించి శివకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించడం వాస్తవమేనన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కన్నబాబు మండిపడ్డారు. వైద్యాధికారిణి శ్రీలక్ష్మిని బాధ్యతల నుంచి తప్పించి వేరే వారికి అప్పగించమని వైద్యవిధాన పరిషత్‌ ఉన్నతాధికారులను ఆదేశించామని చెప్పారు. బాధిత రోగి వద్ద వసూళ్లు చేసిన డబ్బులు తిరిగి వెనక్కి ఇప్పించాలని సూచించానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తప్పవన్నారు.

ఇదీ చదవండి

మౌలికవసతుల కల్పనకు గ్రాంట్లుగా ఇవ్వనున్న కేంద్రం

ABOUT THE AUTHOR

...view details