విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం వద్ద ఎంతో విలువైన ఇనుప యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. అవి ప్రధాన గట్టుపై, సిబ్బంది నివాస గృహాల వద్ద, విశ్రాంత భవనం ప్రాంతాల్లో ఉండటంతో తుప్పుపట్టి కనిపిస్తున్నాయి. 1975 సంవత్సరం జలాశయం నిర్మాణం సమయంలో ఈ యంత్రాలను కొనుగోలు చేశారు. ఉపయోగపడిన యంత్రాలు పోగా.. మిగిలిపోయిన వాటిని అక్కడే వదిలేశారు.
అవి కొన్ని ఏళ్లుగా నిరుపయోగంగానే ఉన్నాయి. ఎండకు, వానకూ ఈ ఇంజిన్లు పాడవుతున్నా.. సంబంధిత జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటిని భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఇనుప యంత్రాల పరిస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని జలవనరుల శాఖ ఏఈ రామారావు అన్నారు.