ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపాలికల్లో కరోనా కలవరం - covid to muncipalites in state of ap

నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని అధికారులు, సిబ్బంది, క్షేత్ర స్థాయిలో పనిచేసేవారిలో కరోనా కలవరం పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10మందికిపైగా కమిషనర్లకు పాజిటివ్‌ వచ్చింది. 100మందికిపైగా కార్యాలయ ఉద్యోగులు, మరో 150 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది.

vsp_purapalika kalavaram-main page item eenadu
vsp_purapalika kalavaram-main page item eenadu

By

Published : Jul 29, 2020, 9:22 AM IST

అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని పురపాలికల్లో కరోనా సమస్య తీవ్రంగా ఉంది. రహదారులు, కాలువలు శుభ్రం చేయటం, ఇళ్ల నుంచి చెత్త సేకరించి వాహనాల్లో తరలించే పారిశుద్ధ్య కార్మికులకు కరోనా ఎక్కువగా సోకుతోంది. ఇందుకు అవగాహనా లోపం, జీవనశైలి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణాలు. ఇప్పటికీ అనేక పురపాలక సంఘాల్లో వ్యక్తిగత రక్షణ పరికరాల్ని అరకొరగానే సరఫరా చేశారు. చేతికి తొడుగులు, ముఖానికి మాస్కులు, బూట్లు, అవసరమైన చోట్ల పీపీఈ కిట్లు సరఫరా చేయాలని పురపాలకశాఖ నుంచి ఆదేశాలున్నా కొన్నిచోట్ల అమలు కావడం లేదు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, కాకినాడ నగర పాలక సంస్థల్లో ఒకసారి ఇచ్చిన మాస్కులు, చేతి తొడుగులనే వారం, పది రోజుల దాకా కార్మికులు వాడుతున్నారు. కొత్తవి సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల నగర పాలక సంస్థల ఉద్యోగులు రోజువారీ విధుల నిర్వహణకు భయపడుతున్నారు.

  • విశాఖ నగర పాలక సంస్థలో (జీవీఎంసీ) అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిపి 30 మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో అదనపు కమిషనరు, జోనల్‌ కమిషనర్లు, ఇంజినీర్లు, ఉద్యోగులు, కమిషనరు బంగ్లా సిబ్బంది ఉన్నారు.
  • కర్నూలు నగర పాలక సంస్థలో కార్యాలయ ఉద్యోగులు 17 మంది, క్షేత్ర స్థాయిలో ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మరో ఇద్దరు సూపర్‌వైజర్లకు వైరస్‌ సోకింది. కేసుల తీవ్రత దృష్ట్యా నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ఇప్పటికే రెండు సార్లు మూసివేశారు.
  • విజయవాడ నగర పాలక సంస్థలోని (వీఎంసీ) వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఒప్పంద సిబ్బందిలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో ఉద్యోగి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఏడుగురు పారిశుద్ధ్య కార్మికులకు కరోనా రావటంతో ఆసుపత్రులకు తరలించారు.


నిధుల వినియోగంపై వెనుకడుగు

కరోనా నియంత్రణ కోసం సాధారణ నిధుల ఖర్చుకు చాలా పురపాలక సంఘాల్లో కమిషనర్లు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు సమకూర్చడం ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయన్న కారణంతో ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కొందరు కమిషనర్లు సాధారణ నిధుల ఊసెత్తడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే చూద్దామన్న ధోరణివల్లే కరోనా బారినపడే కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర పురపాలక కార్మిక, ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ రక్షణ కిట్లు అందించడంతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆయన కోరారు. కరోనాతో మృతి చెందిన కార్మికులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

ఇదీ చూడండి

రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు

ABOUT THE AUTHOR

...view details