భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు.. కనిపించని కరోనా ప్రభావం - corona effect on registrations in visahakapatanam
విశాఖ నగరంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కరోనా అంతగా ప్రభావం చూపలేదు. గత ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో మూడు నెలల్లో భారీగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. మార్కెట్ విలువ పెరగడంతో రెవెన్యూ పెరిగింది.
corona didn't effect registrations at vishakapatnam
By
Published : Jan 9, 2021, 3:28 PM IST
కొవిడ్-19 ప్రభావం విశాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్‌శాఖపై పెద్దగా కనిపించలేదు. కరోనా కారణంగా రెండు నెలలపాటు సేవలు నిలిపేసినా, చాలా రోజుల పాటు కక్షిదారులు రిజిస్ట్రేషన్‌కు ముందుకు రాకపోయినా ఆ తరువాత అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగడంతో ఆదాయం గణనీయంగానే పెరిగింది. దీనికి మార్కెట్ విలువ పెంచడంతో లోటు భర్తీ అయినట్లు కనిపిస్తోంది. గత మూడు నెలల్లో ఎక్కువ డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరగడంతో ఆశించిన దానికన్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖకు విశాఖ నగర పరిధి నుంచి ఎక్కువ ఆదాయమే వచ్చింది. గత ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో సాధించిన ఆదాయం, రిజిస్ట్రేషన్ల కన్నా.. ఈ ఏడాది ఆ మూడు నెలల్లో డాక్యుమెంట్లతో పాటు ఆదాయమూ అధికంగానే వచ్చింది. గత ఏడాది 14,007 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ ఏడాది 17,929 జరిగాయి. ఆదాయంలో గత ఏడాది ఆ మూడు నెలలకు రూ.128.96 కోట్లు వస్తే.. ఈ ఏడాది రూ.213.87 కోట్లు రావడం గమనార్హం. కరోనా తగ్గడం, రాజధాని ప్రకటన నేపథ్యంలో ఎక్కువమంది కొనుగోళ్లకు ముందుకురావడంతో ఒక్కసారిగా ఇవి పెరిగాయి.
2019
2020
నెల
డాక్యుమెంట్లు
ఆదాయం(రూ.కోట్లలో)
డాక్యుమెంట్లు
ఆదాయం(రూ.కోట్లలో)
అక్టోబరు
4259
47.10
5786
67.88
నవంబరు
4666
38.22
5884
68.52
డిసెంబరు
5082
43.64
6259
77.47
మధురవాడ @ రూ.100 కోట్లు
ఈ ఏడాది 9 నెలల్లో వచ్చిన రూ.442.96 కోట్ల ఆదాయం 2019, 2018 సంవత్సరాల్లో కన్నా అధికంగానే వచ్చింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పటికన్నా తక్కువ జరిగాయి. మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ తొమ్మిది నెలల్లో రూ.100 కోట్లపైన ఆదాయం సాధించడం గమనార్హం. విశాఖ ఆర్వో రూ.90 కోట్ల వరకు సాధించింది. గత ఏడాది డిసెంబరులో నగర పరిధిలోని దాదాపు అన్ని కార్యాలయాలు లక్ష్యానికి మించి ఆదాయం సాధించాయి. మొత్తం రూ.68.11 కోట్ల లక్ష్యం విధించగా రూ.77.47 కోట్ల ఆదాయం సాధించాయి. భీమునిపట్నం, గోపాలపట్నం, మధురవాడ, ఆర్వో విశాఖ, పెందుర్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు వంద శాతానికి మించి పెరుగుదల నమోదు చేశాయి. భీమిలిలో లక్ష్యానికి 176.13 శాతం అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక్కడ రూ.4.91 కోట్లు లక్ష్యం విధించగా రూ.8.65 కోట్ల ఆదాయం సాధించింది.