కొంతకాలంగా విశాఖ జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడు కేసులు తగ్గినా.. అజాగ్రత్తగా ఉంటే వైరస్ మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య బాగా తగ్గుతున్నప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
'అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం' - visakha corona deaths latest news update
విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అజాగ్రత్తగా ఉంటే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో యాభై వేలకు పైగా కేసులు నమోదు కాగా.. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
!['అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం' Corona cases are decreased](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8977264-379-8977264-1601359934451.jpg)
ప్రభుత్వ నివేదికల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4,15,679 మంది నుంచి నమూనాలు సేకరించారు. జిల్లావ్యాప్తంగా 910 కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో నగరానికి చెందిన ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. మరోవైపు నగరంలోని 72 ఆరోగ్య కేంద్రాల్లోనూ నమూనాల సేకరణ భారీగా పెంచినట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో గత రెండు నెలల్లో 1,000 పాజిటివ్ కేసులు నమోదైన ఘటనలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల వివరాల్లో జిల్లా స్థానం చూసుకుంటే.. చికిత్స పొందుతున్న కేసుల్లో ఐదో స్థానంలోనూ.. పాజిటివ్ కేసుల నమోదు, మరణాల నమోదులో తొమ్మిదో స్థానంలోనూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.