చింతపల్లిలో కరోనా కలకలం - విశాఖలో కరోనా కలకలం వార్తలు
విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లిలో కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తిని విశాఖ ఛాతి ఆసుపత్రికి తరలించారు. బాధిత వ్యక్తి తానే స్వయంగా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించమని తెలిపినట్లు వైద్యులు వివరించారు.

విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కరోనా వైరస్ లక్షణాలతో ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. డిప్యూటీ సివిల్ సర్జన్ తెలిపిన వివరాల ప్రకారం డైరీ నగర్‌కు చెందిన వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొంతకాలంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సెలవులు ఇవ్వటంతో విమానంలో ఈ నెల 12న విశాఖపట్నం చేరుకుని తన స్నేహితుడి ఇంట్లో బస చేశాడు. 13న చింతపల్లి చేరుకుని గూడెంకొత్తవీధి మండలంలో వివాహ వేడుకలకు హాజరయ్యి అక్కడి నుంచి చింతపల్లి చేరుకున్నాడు. తనకు మూడు రోజులుగా తలనొప్పి, జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉందని వైద్య పరీక్షలు చేయాలని ఆసుపత్రికి వెళ్లాడు. స్వయంగా తానే వచ్చి ఆసుపత్రిలో చేరాడని డిప్యూటి సివిల్ సర్జన్ ఉమామహేశ్వరరావు తెలిపారు. వైద్యులు పరిశీలించి విశాఖ చాతి, శ్వాసకోస వ్యాధుల ఆసుపత్రికి తరలించామని తెలిపారు.