రైలు ప్రమాదంతో ఏపీ రైల్వేశాఖ అప్రమత్తం.. హెల్ప్‌లైన్ కేంద్రాలు Railway Station Helpline Numbers: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కోరమాండల్తో పాటు యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాలు, ఇతర సమాచారం కోసం 1070, 112, 18004250101 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ సూచించింది. మరోవైపు ఏపీకి చెందిన ప్రయాణికులు కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో 178 మంది ఉన్నట్టుగా రిజర్వేషన్ చార్టుల ప్రకారం నిర్ధారించారు. ఫస్ట్ ఏసీలో 9 మంది, సెకండ్ ఏసీ బోగీల్లో 17 మంది, థర్డ్ ఏసీ భోగీల్లో 114 మంది, స్లీపర్ క్లాస్ లో 38 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
గుంటూరు.. ప్రమాదానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని తెనాలి, బాపట్ల రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. రైలు ప్రమాద బాధితుల వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్స్‌తో ప్రత్యేకంగా డెస్క్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కోరమండల్, బెంగుళూరు హౌరా రెండు రైళ్లు తెనాలి, బాపట్ల మీదుగా వెళ్లాయి. ఈ నేపధ్యంలోనే రెండు స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.
ALSO READ:'సిగ్నలింగ్ వైఫల్యం వల్లే ఒడిశా ప్రమాదం.. 'కవచ్' ఉంటే ఘటన జరిగేదే కాదు!'
విశాఖ..ఒడిశాలోని కోరమండల్ ఘటనకు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ అప్రమత్తమైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. విశాఖ రైల్వేస్టేషన్‌కు సంబంధించి 08912746330, 08912744619 నెంబర్లతో హెల్ప్‌లైన్ కేంద్రం వద్ద రైల్వే సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలానే అత్యవసర సేవ నిమిత్తం ఒక అంబులెన్స్‌ను స్టేషన్ బయట ఉంచారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లు రద్దవడం, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారిలో విశాఖకు చెందినవారు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ:ఒడిశా ప్రమాదంపై సీఎంల సంతాపం.. పరిహారం ప్రకటించిన స్టాలిన్.. వారి కోసం స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం..ఒడిశాలో ప్రమాదానికి గురైన.. కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలులో.. రాజమహేంద్రవరం చేరుకోవాల్సిన ప్రయాణికులంతా.. దాదాపు సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరానికి మొత్తం 24 మంది రిజర్వేషన్ చేయించుకున్నారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్టు పాసింజర్లు ఉన్నారు. ఉదయం 7 గంటల 20 నిమిషాల సమయానికి.. రాజమహేంద్రవరం చేరుకోవాల్సిన కోరమండల్ రైలు రాత్రే ప్రమాదానికి గురైంది. రాజమహేంద్రవరం.. హెల్ప్‌లైన్‌కు ఒక్క ప్రయాణికుడి బంధువు తప్ప.. ఎవరూ ఫోన్ చేయలేదని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు.. పట్టాలు తప్పిన బెంగళూరు- హుడా ఎక్స్‌ప్రెస్‌లో.. రాజమహేంద్రవరం నుంచి ఒక ప్రయాణికుడు రిజర్వేషన్ చేయించుకుని ఎక్కాడని.. జనరల్ బోగీలో ఎవరైనా ఎక్కారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఇదే సమయంలో.. కొన్ని రైళ్ల రద్దుతో రాజమహేంద్రవరం స్టేషన్‌లో.. చాలా మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
ALSO READ:ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన చిరు, తారక్.. అలా చేయాలని రిక్వెస్ట్!
ఏలూరు..ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఏలూరుకు చెందిన ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరికి స్వల్పగాయాలు కాగా మరొకరు పూర్తి క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఏలూరు మీదుగా వెళ్లాల్సిన.. 12 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల ద్వారా పూర్తి సమాచారం ప్రయాణికులు తెలుసుకోవచ్చని తెలిపారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో.. ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి వివరాలు..ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులోనిఆంధ్రప్రదేశ్ చెందిన వారి వివరాలను రైల్వేశాఖ వెల్లడించింది. షాలినగర్‌లో 32మంది, సంత్రగచిలో ఆరుగురు, ఖరగ్‌పూర్‌లో ముగ్గురు ఎక్కినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 48 మందిలో 32మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది, ఏలూరులో ఇద్దరు, తాడేపల్లిగూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో 12 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికుల వివరాలను విజయవాడ స్టేషన్‌లోకి హెల్ప్‌లైన్ కేంద్రానికి పంపినట్లు అధికారులు తెలిపారు.