విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం రావిమానుపాకలు అటవీప్రాంతం ఘాట్రోడ్లో... ఈనెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. చింతపల్లి పోలీసులు ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్యకు గల కారణాలను, జరిగిన తీరును చింతపల్లి సీఐ సన్యాసినాయుడు వివరించారు. బాబురావు అనే వ్యక్తి, కాకినాడకు చెందిన చల్లా రామ్మోహన్ రెడ్డి కలసి అనకాపల్లి, తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుండే వారు. దోపిడీ చేసిన సొమ్ము పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఎలాగైనా బాబురావుని హతమార్చలని రామ్మోహన్ రెడ్డి తన వరసకు చిన్నాన్న అయిన రాఘవేంద్రరావు సహాయం కోరాడు.
వీరిదద్దరూ మరో నలుగురిని కలుపుకుని బాబురావు హత్యకు ఒడిగట్టారు. ఈ నెల 8న నర్సీపట్నంలో ఓ కారును అద్దెకు తీసుకొని కసింకోటకు వెళ్లారు. అక్కడ హతుడు బాబురావును బయటికి వెళదామని కోరగా అతను అంగీకరించి వారితో వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బాబురావును అపస్మారక స్థితికి వెళ్లే వరకు కారులోనే చితకబాదారు. నర్సీపట్నం దాటిన తర్వాత కారులో ఉన్న నలుగురు దిగిపోయారు. అక్కడే ప్రధాన నిందితుడు రామ్మోహన్ రెడ్డి, రెండో నిందితుడు రాఘవేంద్రరావులు పెట్రోల్ కొనుగోలు చేసి రావిమానుపాకలు గ్రామం వైపు వెళ్లారు. లోయలో బాబురావుని పడేసి పెట్రోలు పోసి దహనం చేశారని పోలీసులు తెలిపారు.