ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారుల మోసాలు.. వినియోగదారుల జేబులకు చిల్లులు.. - ap latest news

దుకాణాల్లో డబ్బులు చెల్లిస్తున్న కొనుగోలుదారులను కొందరు వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. తూకంలో... ధరల్లో... నాణ్యతలో.. ఇంకా పలు రూపాల్లో చేతి వాటం చూపుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో ఈ విషయాలు బయటపడి కేసులు నమోదు చేస్తున్నా ఏ మాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారుల దాడులు పెరిగిన నేపథ్యంలో మరిన్ని మోసాలు వెలుగు చూస్తున్నాయి.

consumers-losing-money-on-merchant-scams
వ్యాపారుల మోసాలు.. వినియోగదారుల జేబులకు చిల్లులు..

By

Published : Oct 9, 2021, 8:34 AM IST

మొబైల్‌ మరమ్మతు చేయించుకునేందుకు వెళ్తున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు అధికారులు. కొందరు నాసిరకం సామగ్రిని వినియోగదారులకు అంటగడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ డిస్‌ప్లే, స్క్రీన్‌గార్డులు, ఇయర్‌ ఫోన్లు, ఫ్లిప్‌కవర్లు కొనుగోలు సమయంలో ఇలా చేస్తున్నారు. వాటికి సంబంధించిన వస్తువులపై ప్యాకింగ్‌ నిబంధనలు పాటించడం లేదు. దీంతో నాణ్యతపై సందేహించాల్సి వస్తోంది. ముఖ్యంగా డిస్‌ప్లేలకు సంబంధించి మొబైల్‌ ఆధారంగా దాని ధర ఆధారపడి ఉంటుంది. సాధారణ ఫోన్లకు రూ. 2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తుండగా...అధిక ధర ఫోన్లకు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకొని చేసినప్పటికీ నాణ్యమైన పరికరాలు వాడటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరికి పాత ఫోన్లవి, అదే ఫోన్‌ది బాగు చేసి వేస్తున్నారు. బాగు చేయడానికి ఇచ్చిన ఫోన్‌ను తీసుకొని తరువాత రోజు రమ్మనడంతో ఏం చేశారన్నది వినియోగదారుడికి తెలియడం లేదు.

  • అలాగే చాలామంది నాణ్యత లేనివి తెప్పించి అమర్చుతున్నారు. దాన్ని ఎవరు తయారు చేశారు వంటి కనీస వివరాలు లేకపోగా బిల్లు ఇవ్వడం లేదు. దీంతో అధిక సంఖ్యలో ఇక్కడ మోసాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇక్కడ ఇలా...

  • కిరాణా దుకాణాల్లో ఎంఆర్‌పీ కన్నా అధిక రేట్లకు విక్రయించడం, తూకాల్లో అరిగిపోయిన రాళ్లను వినియోగించడం, డిజిటల్‌ తూనిక యంత్రాల్లో తప్పుగా నమోదు చేయడం, నికర బరువు కన్నా తక్కువ ఉండేలా ప్యాకింగ్‌ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఈ తరహా విధానాలు పాటిస్తున్న వ్యాపారులపై అధికారులు పెద్ద సంఖ్యలో కేసులు పెడుతున్నారు. గత ఆరు నెలల్లో 219 కేసులు పెట్టారు.
  • నగరంలోని పలువురు బేకరీల నిర్వాహకులు కేకులను మొత్తం బరువుకు అమ్మకుండా కిందనున్న అట్టతో కలిపి తూకం వేస్తున్నారు. ఇలా చేయడంతో వినియోగదారుడు రెండొందల గ్రాముల వరకు నష్టపోవాల్సి వస్తుంది. కేజీ, రెండు కేజీలు కొన్నప్పుడు బాక్సు, కింద అట్ట బరువుతో కలిపే తూస్తున్నారు. పండగలు, ప్రత్యేక దినాల్లో కొందరు డిజిటల్‌ యంత్రాలను మార్చేస్తున్నారు.
  • వైద్యసంబంధ పరికరాలకు సంబంధించి తనిఖీల్లో కొన్ని రకాల వస్తువులు ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయో తెలియడం లేదు. ఆ వస్తువు తయారీలో సరైన ప్రమాణాలు పాటించకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, థర్మామీటర్లు మీద ఎటువంటి వివరాలు ఉండడం లేదు

షాపింగ్‌ మాళ్లలో...

కొన్ని షాపింగ్‌ మాళ్లలో ప్యాకింగ్‌ చేసిన వస్తువులపై పూర్తి వివరాలు ఉండడం లేదు. వస్తువు...ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, వంటి వివరాలు ఉండాలి. అలాగే కస్టమర్‌కేర్‌ నంబరు కనిపించడం లేదు. రడీమేడ్‌ దుకాణాల్లో ప్యాకింగ్‌ దుస్తులపై ఎంఆర్‌పీ లేకుండా అమ్ముతున్నట్లు తనిఖీల్లో తేలింది. మరో వైపు ప్యాకింగ్‌ మీద ఉన్న ధర కన్నా బిల్లు ఎక్కువేసి విక్రయిస్తున్నారు. వీటిపై అధికారులు గత ఆరు నెలల్లో 35 కేసులు పెట్టి రూ.5 లక్షల వరకు అపరాధ రుసుం విధించారు.

రెండు నెలల కిందట నగరంలోని పలు దుకాణాలను తనిఖీ చేసి 15 వరకు కేసులు నమోదు చేయగా... ఆరు నెలల్లో 24 కేసులు పెట్టారు.

తనిఖీలు పెంచుతాం...

నిత్యావసర సరకులపై తనిఖీలు మరింత పెరగనున్నాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో ఆయా దుకాణాలను, బంకులను తప్పని సరిగా పరిశీలించాల్సిందే. దీంతో జిల్లాలో తనిఖీలు భారీగా పెరుగుతాయి.

ఇదీ చూడండి:మళ్లీ నిలిచిపోయిన వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలు

ABOUT THE AUTHOR

...view details