ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Construction Sector: భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది: క్రెడాయ్‌ - భవన నిర్మాణ రంగం కుదేలైపోయిందన్న క్రెడాయ్

Construction sector: భవన నిర్మాణ సామగ్రి, ముడి సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఆ రంగం కుదేలైపోతుందంటూ.. క్రెడాయ్‌ సహా పలు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు రాయితీ ధరపై సిమెంటు ఇస్తున్న కంపెనీలు...తమకు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతున్నాయని.. ఇది చూస్తుంటే ప్రభుత్వం, సిమెంటు కంపెనీలు కలిసి పని చేస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు.

Construction sector problems with increased prices
భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది: క్రెడాయ్‌

By

Published : Apr 10, 2022, 7:46 AM IST

Construction sector: పెరిగిన ధరలతో భవణ నిర్మాణ రంగం కుదేలైపోతుందంటూ.. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) సహా పలు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి సంస్థలు సిండికేటుగా మారి ధరల్ని విపరీతంగా పెంచేస్తున్నాయని ధ్వజమెత్తారు. టన్ను స్టీలు ధర రూ.40 వేల నుంచి రూ.90 వేలకు, బస్తా సిమెంటు ధర రూ.250 నుంచి రూ.450కి పెరిగిందని..ఇదంతా చూస్తుంటే దోపిడీలా ఉందని ఆరోపించారు. 2020 అక్టోబరు నుంచి ఇప్పటివరకూ భవన నిర్మాణ రంగ ముడి సరకుల ధరలు 40-50 శాతం మేర పెరిగాయన్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులకు రాయితీ ధరపై సిమెంటు ఇస్తున్న కంపెనీలు...తమకు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతున్నాయని.. ఇది చూస్తుంటే ప్రభుత్వం, సిమెంటు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు. భవన నిర్మాణ సామగ్రి, ముడిసరకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ క్రెడాయ్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ), నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నెరడ్కో) ఆర్కిటెక్ట్స్‌ అసోసియేషన్‌ (ఏఏ), లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ (ఎల్‌టీపీ), బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌, సబ్కా తదితర సంఘాలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ‘‘పనికి విరామం (వర్క్‌ హాలిడే)’’ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నాల్లో వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు.

విశాఖలోనే లక్ష మంది కార్మికులకు ఒక రోజు వేతనం నష్టం:పని విరామం వల్ల ఒక్క విశాఖలోనే లక్ష మంది కార్మికులు ఒక రోజు వేతనం నష్టపోవాల్సి వచ్చిందని, ధరల్ని తగ్గించకపోతే భవిష్యత్తులోనూ ఈ తరహా నిరసన కొనసాగిస్తామని క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.రాజ శ్రీనివాస్‌ ప్రకటించారు. కేంద్రం సిమెంటుపై జీఎస్టీ తగ్గించాలన్నారు. పెరిగిన ధరలను ప్రభుత్వం నియంత్రించాలని క్రెడాయ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.రమణరావు కోరారు. ధరలు స్థిరంగా లేకపోవటం వల్ల పెట్టిన పెట్టుబడులైనా రావట్లేదని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు బి.రాఘవరావు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఉపాధ్యక్షుడు వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధరల్ని తరచూ పెంచేయటం వల్ల నష్టాల పాలవుతున్నామని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మాట్లాడారు. నిరసనల్లో ఆర్కిటెక్ట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.వేణుగోపాల్‌,సబ్కా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌డీ ప్రసాదరావు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details