Protests by Congress Ranks Across the State: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టి సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీగా పోలీసులను మోహరించి గాంధీభవన్ గేటు వద్దే నేతలు, కార్యకర్తలను నిలువరించారు. దీంతో నేతలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. నోటీసులివ్వకుండా ఎందుకు తనిఖీలు చేశారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే:ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల ద్వారా సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని.. మాదాపూర్‌లోని కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కార్యాలయం కేంద్రంగా ఇదంతా జరుగుతోందని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని సోనాలి స్పాజియో టవర్స్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు.