పంచాయతీ ఎన్నికల సమయం కావటంతో విశాఖ మన్యంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలంటూ రెండు వారాలుగా మావోయిస్టులు పిలుపునిస్తున్నారు. తాజాగా ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు సర్పంచి అభ్యర్థి భర్తను అపహరించుకుపోయారు. తీవ్రంగా కొట్టి, పోటీ నుంచి వైదొలగాలని హెచ్చరించి వదిలిపెట్టారు. ఈ ఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మన్యంలో సర్పంచి అభ్యర్థులలో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతుంది.
పంచాయతీ ఏకగ్రీవాలు
ఏజెన్సీలో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, గూడెం కొత్తవీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టుల హెచ్చరికలతో స్థానిక సంస్థలకు పోలింగ్ జరగకపోవడం లేదా ఏకగ్రీవం కావడం సాధారణం. ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయవద్దంటూ మావోయిస్టులు ముందుస్తుగానే ప్రకటనలు, హెచ్చరికలు జారీచేశారు. దీంతో పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీలో ఒక్కరూ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. పెదబయలు మండలం ఇంజెరి, జీకే వీధి మండలం మొండిగెడ్డ, ధారకొండ, అమ్మవారి ధారకొండ పంచాయతీల్లోనూ సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ పంచాయతీల పాలక వర్గాలు ఏకగ్రీవం అయ్యాయి.
అప్రమత్తమైన పోలీసులు