విశాఖ జిల్లాలో 260 స్కూల్ కాంప్లెక్స్ లను కుదించి 233 కు చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కాంప్లెక్స్ల కు 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉండాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల అమలు పై వ్యతిరేకత లేకపోయినా, అన్ని రకాల అర్హతలున్న కాంప్లెక్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేయడం తప్పని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి స్కూల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉండాలి ? ఎక్కడ రద్దు చేయాలి? అనే దానిపై మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలో చర్చించి ప్రతిపాదనలు పంపాలని. కానీ జిల్లాలోని అనేక మండలాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
* నాతవరం మండలంలో 25 మంది టీచర్లు ఉన్నప్పటికి... మల్లు భూపాలపట్నం కాంప్లెక్స్‌ను 17 మంది టీచర్లు ఉన్న గునుపూడి కాంప్లెక్స్ లో విలీనం చేశారు. మల్లు భూపాలపట్నం కాంప్లెక్స్ అన్ని పాఠశాలలకు అనువుగా ఉంటుంది. అదే గునుపూడి మారుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడ అధికార పార్టీ నేత సిఫార్స్ తోనే విలీనం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* రావికమతం మండలంకు సంబంధించి కాంప్లెక్స్ మేడివాడ లో విలీనం చేశారు. అలాగే పద్మనాభం మండలం కాంప్లెక్స్‌ను అనంతవరం కాంప్లెక్స్ లో విలీనం చేశారు. ఈ గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న రెడ్డిపెళ్లిలో మరో కాంప్లెక్స్ ఉంది. అనంతవరం కాంప్లెక్స్లో 31 మంది ఉపాధ్యాయులు ఉండగా పద్మనాభంలో 23 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అనంతవరం పరిధిలోని తిమ్మాపురం, గంధవరం, పాఠశాలలో పద్మనాభం ప్రాంతానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.