పర్యావరణ పరిరక్షణ కోసమే స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. నగరాలు అంటే కాలుష్య కేంద్రాలుగా భావించే దుస్థితి నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ బాటలో ఆరోగ్యకర పోటీకి నాంది పలికే పరిస్థితికి వచ్చాం. ఈ పోటీలో విశాఖ నగరం తొలి 3 ఏళ్లలో కనబరిచిన ప్రత్యేకత దేశం మొత్తాన్ని ఆకర్షించింది. 205వ ర్యాంక్ నుంచి రెండేళ్లు 5, 3 ర్యాంకులకు ఎగబాకింది. స్వచ్ఛ నగరిగా దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరిగా మారుతున్న నేపథ్యంలో స్వచ్ఛ ర్యాంకుల్లో విశాఖ స్థానం క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినా నిరుత్సాహ పడకుండా ఈ ఏడాది తిరిగి సింగిల్ డిజిట్ ర్యాంకును కైవసం చేసుకుంది. పది లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో వచ్చిన ర్యాంకుతో ఇప్పుడు మహా విశాఖ నగర పాలక సంస్థ మరింత ఉత్సాహంతో నగరంలో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తోందని జీవీఎంసీ కమిషనర్ డా.సృజన తెలిపారు.
శుద్ధికి సన్నద్ధం..
నగరాన్ని చెత్త రహితంగా మార్చడానికి ఇచ్చే ప్రాధాన్యతకు దీటుగా చెత్తను శుద్ధి చేసే కార్యక్రమానికీ సన్నద్ధమైంది. వ్యర్థ నిర్వహణ దిశగా జీవీఎంసీ ప్రయత్నాలు సాగర నగరిని ఆదర్శంగా నిలపనున్నాయి.
జీవీఎంసీ చర్యలతో విప్లవాత్మక మార్పులు..
విశాఖ నగరంలో ఉత్పన్నమయ్యే చెత్తను రెండు దశాబ్దాలకుపైగా భరిస్తున్న కాపులుప్పాడ డంపింగ్ యార్డు రూపు రేఖలు మారబోతున్నాయి. జీవీఎంసీ చేపడుతున్న పర్యావరణహిత చర్యలు ఊహించని మార్పుల్ని సాధ్యం చేయనున్నాయి. సమగ్ర సమీకృత వ్యర్థశుద్ధి కేంద్రంగా కాపులుప్పాడ ప్రాంతాన్ని ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. ఎటు చూసినా పచ్చని కొండలు కనిపించే డంపింగ్ యార్డు సుమారు 110 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏళ్లుగా పోగుపడిన చెత్త కారణంగా భూమిలో అడుగు లోతున వ్యర్థాలు పేరుకున్నాయి. వ్యర్థాల నుంచి విడుదలయ్యే వాయువులతో రాజుకునే చిచ్చు. ఫలితంగా కమ్ముకునే పొగ. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే సమీప ప్రాంతాల ప్రజలు. అటు వైపుగా వెళ్లాలంటే ముక్కుపుటలకు భరించలేని దుర్వాసన. ఇలా ఒక డంపింగ్ యార్డ్ అనేక సమస్యలు అన్నట్లుగా ఉండేది అక్కడి పరిస్థితి.
అందుకు ఉదాహరణ కాపులుప్పాడ..
వ్యర్థాలను బహిరంగంగా పోగేస్తే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనే దానికి సరైన ఉదాహరణగా ఉండే కాపులుప్పాడ డంపింగ్ యార్డు.. సవాళ్లను అవకాశాలుగా తీసుకుని పరిష్కార మార్గంలో పయనిస్తే జరిగే అద్భుతాలకు నిదర్శనం అవుతోంది. మారికవలస, కాపులుప్పాడ పరిసర ప్రాంత ప్రజలకు ఇప్పుడు ఓ భరోసా. తాము ఇంకెంతో కాలం చెత్త సమస్యను ఎదుర్కోమనే భావ.