ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు కొత్త పుంతలు - Campus placements in visakhapatnam district

నగరంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయా ప్రాంగణ నియామకాల సరళిని జాగ్రత్తగా గమనించి పక్కా ప్రణాళికతో ముందు నుంచి ఆయా ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే అత్యుత్తమ వేతనాలతో బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలను సాధించవచ్చని నిరూపిస్తుంది నేటి యువత.

Campus placements
కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు కొత్త పుంతలు

By

Published : Dec 25, 2020, 1:25 PM IST


నగరంలోని పలు కళాశాలల విద్యార్థులు కొవిడ్‌ సమయంలోనూ చదువుల్లో మంచి ప్రతిభ చూపించి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలను సాధిస్తున్నారు. ఆ విధంగా ఉద్యోగాలు సాధించడానికి విద్యార్థులు కృషి ఒక కారణమైతే.. కళాశాలల్లోని ఉపాధి కల్పన అధికారులు చొరవ తీసుకొని పలు దిగ్గజ సంస్థల ఉన్నతాధికారుల్ని ఒప్పించి ప్రాంగణ నియామకాలు నిర్వహించేలా ఒప్పించడం కూడా మరో కారణం. విద్యార్థులు, ప్లేస్‌మెంట్‌ అధికారులు కలిసి ఆయా ప్రాంగణ నియామకాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

హ్యాకథాన్​లో విజయం సాధిస్తే అవకాశాలు మెండు..

వివిధ సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా విద్యార్థులు ఎలాంటి పరిజ్ఞానాలు ఉపయోగించి ఎంత సమర్థమైన పరిష్కారాలను, ఎంత వేగంగా కనుగొంటున్నారన్న విషయం ఇటీవలికాలంలో ప్రధాన ప్రామాణికంగా మారుతోంది. అందుకు హ్యాకథాన్‌ పోటీలు ప్రధాన వేదికలుగా నిలుస్తున్నాయి. ఆయా హ్యాకథాన్‌ పోటీల్లో భాగస్వామ్యం అయ్యే తీరును బట్టి కూడా వారికి లభించే వేతనం ఉంటోంది.


ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా ఎంతో ప్రతిభావంతుడు కావచ్చు. కానీ సంస్థల్లో అందరితో కలిసి పనిచేయాలి. అందరితో కలిసి సమర్థంగా పనిచేయాలంటే అతనికి బృందస్ఫూర్తి ఉండాలి. ఒక సమస్యను పరిష్కరించడానికి కొంతమంది విద్యార్థులు బృందంగా ఏర్పడి, పలు బాధ్యతల్ని పంచుకొని, అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి మంచి ఫలితం రాబట్టాలి. విద్యార్థులకు ఆవిధమైన మనస్తత్వం ఉందా? లేదా? అన్న విషయాలు హ్యాకథాన్‌ పోటీల్లో వారు సాధించే విజయాలే నిదర్శనంగా నిలుస్తాయి.

విశాఖలోనూ ‘సేల్స్‌ఫోర్స్‌’ నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ ఐ.టి. సంస్థలకు సుశిక్షితులైన మానవవనరుల్ని అందించడంలో ‘సేల్స్‌ఫోర్స్‌’ అనే సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది. ఆ సంస్థ ఆసక్తి ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొందరు ఆచార్యులకు శిక్షణ ఇచ్చి వారితో ఆయా కళాశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆ విధంగా శిక్షణ పొందిన విద్యార్థులు శిక్షణకాలంలో నిర్వహించే పరీక్షల్లో విజయం సాధిస్తే చదువు పూర్తయ్యే సమయానికి మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ‘సేల్స్‌ఫోర్స్‌’‌ సంస్థ సుమారు 150 సంస్థలకు అవసరమైన మానవవనరుల్ని సమకూరుస్తోంది. నగరానికి చెందిన ఓ విద్యార్థి రూ.29 లక్షల వార్షిక వేతనానికి, ఎనిమిది మంది విద్యార్థులు రూ.19 లక్షల వార్షిక వేతనాలకు ప్రాంగణాల్లోనే ఎంపిక కావడం విశేషం.

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగావకాశాల్ని కల్పించడానికి ‘సేల్స్‌ఫోర్స్‌’ సంస్థ సిద్ధంగా ఉందని అనిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఉపాధికల్పన అధికారి డాక్టర్‌ పి.వి.శ్రీనివాసశర్మ తెలిపారు. వారిచ్చే ముందస్తు శిక్షణ తీసుకుని ప్రతిభ నిరూపించుకుంటే అత్యుత్తమ వేతనాలతో ఉద్యోగాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘సేల్స్‌ఫోర్స్‌’ తరపున శిక్షణ కార్యక్రమాల బాధ్యతను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

అనిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఉపాధికల్పన అధికారి డాక్టర్‌ పి.వి.శ్రీనివాసశర్మ

ఇవీ చూడండి...

చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details