ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్‌ సేవల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు'

కొవిడ్ రోగులకు వైద్యం అందించటంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. సిబ్బంది ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆక్సిజన్‌ స్థాయి 90-94 వరకు ఉన్న రోగులను బోధనాసుపత్రుల్లో చేర్చుకొని వైద్యం అందించాలన్నారు.

review meeting
review meeting

By

Published : May 22, 2021, 6:57 AM IST

ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులకు వైద్యం అందించడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షక వైద్యాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సిబ్బంది ఎల్లప్పుడూ రోగులకు అవసరమైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఛాతీ, ఈఎన్‌టీ, ఆర్‌ఈహెచ్‌, మానసిక ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఆక్సిజన్‌ స్థాయి 90-94 వరకు ఉన్న రోగులను బోధనాసుపత్రుల్లో చేర్చుకొని వైద్యం అందించాలన్నారు. జిల్లాలో ఉన్న 57 ప్రైవేటు ఆసుపత్రుల్లో నిరంతరంగా తనిఖీలు చేస్తూ వైద్య సేవలు, పడకలు తదితర వివరాలపై ఆరా తీయాలన్నారు. పడకలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను త్వరగా తయారు చేయాలని సర్వేశాఖ ఏడీను ఆదేశించారు.

కేజీహెచ్‌లో ఆక్సిజన్ ప్లాంట్​ ప్రారంభం

కేజీహెచ్‌లో కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ శుక్రవారం ప్రారంభించారు. ఉత్పత్తి, స్టోరేజి, సరఫరా తదితర వివరాలను కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణం నుంచి సేకరించిన గాలి ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేస్తామని ఎలక్ట్రికల్‌ డీఈ ఫణికుమార్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంటు నిర్వహణకు ముగ్గురు ఉద్యోగులను కేటాయించామని కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.మైథిలి తెలిపారు. కేజీహెచ్‌ ఆవరణలోని నర్సింగ్‌ వసతి గృహం పక్కన దీన్ని ఏర్పాటు చేశారు. ప్లాంటు నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.3.4 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు 400 ఆక్సిజన్‌ సిలిండర్ల మేర ఇక్కడ ఉత్పత్తి కానున్నది.

ఇదీ చదవండి

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: ఎంపీ

ABOUT THE AUTHOR

...view details