విశాఖ జిల్లా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల్లో రాష్ట్ర అతిథిగృహం కోసం కేటాయించిన స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించినట్లు సమాచారం. నవంబర్ 9న సాయంత్రం ఆరున్నర గంటలకు విశాఖకు చేరుకున్న ఆయన... పలువురు అధికారులతో విమానాశ్రయంలో కొద్దిసేపు సమావేశమై నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది.
రాష్ట్ర అతిథిగృహ నిర్మాణ స్థలంలో ప్రస్తుతం పనులు ఏవిధంగా సాగుతున్నాయో పరిశీలించి.. వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులతో కలిసి వెళ్లిన ఆయన... లెవెలింగ్ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అతిథిగృహ ఆకృతులు, నిర్మాణవ్యయం ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయో ఆరాతీశారు. ఈ ప్రాజెక్టు బృహత్తర ప్రణాళికపై సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పరిశీలనంతా రాత్రి సమయంలో అత్యంత గోప్యంగా జరిగినట్లు తెలుస్తోంది.