విశాఖ నగరాభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. విశాఖలో రవాణా, తాగునీరు, రోడ్లు, పర్యటక ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. భవిష్యత్తు అవసరాలు తీర్చేలా తాగునీటి సరఫరా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలవరం నుంచి నేరుగా పైపులైను ద్వారా విశాఖకు నీటిసరఫరాపై సమాలోచనలు జరిపారు. పోలవరం వద్దే నీటిని వడకట్టి అక్కణ్నుంచి విశాఖకు తరలించాలని సూచించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి పట్టణాలకూ తాగునీరు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
పరిశ్రమలకు డీశాలినేషన్ నీరు...
పరిశ్రమల అవసరాలకు డీశాలినేషన్ వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు ప్రెష్‌వాటర్ కాకుండా డీశాలినేషన్ నీటిని వాడే ఆలోచన చేయాలన్నారు. ఈ పద్ధతితో లీటర్ నీటికి 4 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
విశాఖ మెట్రో... ముంబయి పిల్లర్లు..
విశాఖ మెట్రో బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలపై సీఎంకు అధికారులు వివరించారు. పలు దేశాల్లోని మెట్రోరైల్ మోడళ్లను ముఖ్యమంత్రికి చూపించారు. మెట్రోరైల్ కోచ్‌ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అత్యుత్తమ విధానాలు పాటించాలని... ముంబై మెట్రో నిర్మాణంలోని పిల్లర్ డిజైన్‌ను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రతి స్టేషన్, ప్రధాన జంక్షన్ల వద్ద పార్కింగ్‌కు స్థలాలు ఉండాలని స్పష్టం చేశారు.