CM Jagan Reacts on Vizag Fishing Harbour Fire: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకారులకు వేదన మిగిల్చింది. ఈ ఘటనలో 30కి పైగా బోట్లు ఆహుతయ్యాయని.. తమకు ఉపాధి ప్రశ్నార్థకమైందని జాలర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని.. తొలుత అందులో మంటలు చెలరేగి.. కొద్దిక్షణాల్లోనే పక్క బోట్లకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
'ఉత్సవాల వేళ విషాదం' రేపు మత్స్యకార దినోత్సవం - వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపిన అగ్నిప్రమాదం
మత్స్యకారుల ఆందోళన: అగ్నిప్రమాదంలో 25 నుంచి 30 కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. బోట్ ఓనర్లు, కళాసీలు, మత్స్యకారులు ఉపాధి కోల్పోయామని బోరున విలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జాలర్లను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి.. ప్రభుత్వం అదుకోకపోతే.. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని... హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద మత్స్యకార నాయకులు ఆందోళన చేశారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju) వద్ద బాధితులు నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని.. తమ బోట్లు తగలబడి పోవడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మత్య్సకారులు మంత్రికి విన్నవించుకున్నారు.