CM COMMENTS ON VISAKHA CAPITAL : కొద్దిరోజుల్లోనే విశాఖ.. రాష్ట్ర రాజధాని కాబోతుందని సీఎం జగన్ అన్నారు. తానూ కొన్ని నెలల్లోనే అక్కడికి తరలివెళ్తున్నట్లు.. దిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సమావేశంలో.. స్పష్టంచేశారు. మార్చిలో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని...పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
మార్చిలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు సన్నాహకంగా దిల్లీలో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ముందుగా రాష్ట్రంలో పరిశ్రమలకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన సీఎం.. సదస్సు ముఖ్యోద్దేశాలతోపాటు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రతినిధులకు వివరించారు.
11.4 జీఎస్‌డీపీతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాకింగ్స్‌లో వరుసగా మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలిచాం. పరిశ్రమలతోపాటు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని క్రోడీకరించి ఇచ్చిన ర్యాంకింగ్స్‌లోనే వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో ఉన్నాం. ఇది చాలు ఏపీలో మా ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పడానికి. సులభతర వాణిజ్యంలో దరఖాస్తు సమర్పించిన 21 రోజుల్లోనే సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులు ఇచ్చేస్తున్నాం. 974 కిలోమీటర్ల సముద్రతీరం, 4 ప్రాంతాల్లో ఇప్పటికే సేవలందిస్తోన్న 6 పోర్టులతో పాటు.. మరో 4 నౌకాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆరు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో రానున్న 11 పారిశ్రామిక కారిడార్లలో.. 3 రాష్ట్రంలో వస్తున్నాయి. వీటితో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అభివృద్ధి, అనుసంధానాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందో స్పష్టమవుతోంది.-సీఎం జగన్
త్వరలో విశాఖ రాష్ట్ర రాజధాని కాబోతోందన్న ఆయన.. మార్చిలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు.
కొద్ది రోజుల్లో ఏపీ రాజధాని కాబోతున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేనూ కొద్ది నెలల్లోనే విశాఖకు తరలివెళ్తున్నా. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నా. సదస్సుకు రావడమే కాదు.. విదేశాల్లో మీకు తెలిసిన పారిశ్రామికవేత్తలకు.. ఏపీలో బిజినెస్ చేయడం ఎంత సులువో వచ్చి చూడమని, పరిశీలించమని మంచి మాటగా చెప్పండి. త్వరలో విశాఖలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా.-సీఎం జగన్
ఇవీ చదవండి: