CM Jagan Inaugurated the Infosys Center in Visakha:విశాఖపట్నం జిల్లా మధురవాడ ఐటీ హిల్స్ 2లో నిర్మించిన ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ డేటా కేంద్రం ద్వారా క్లౌడ్, A.I, డిజిటల్ టెక్నాలజీ సేవలను అందించనున్నారు. ఈ కేంద్రంలో మొదటి దశలో 500 మందికి అవకాశం కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ యాజమాన్యం వెల్లడించింది.
CM Jagan Comments:ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..''ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థ విశాఖకు రావడంతో స్థానిక యువతకు ఉపాధి లభించడమే గాక.. ఇంకా పేరున్న ఐటీ సంస్థలు తరలివచ్చే అవకాశం ఉంది. విశాఖలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో యువత చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారందరికీ ఇలాంటి సంస్థలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.'' అని అన్నారు.
CM Jagan on Visakha Administration: త్వరలోనే తాను కూడా విశాఖ రాబోతున్నానని.. డిసెంబర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్రంలోనే విశాఖ అతి పెద్ద నగరమన్న జగన్.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయికి అభివృద్ధి చెందే సామర్థ్యం విశాఖ నగరానికి ఉందన్నారు. అనంతరం విశాఖలో మంచి కార్యాలయాన్ని చూడాలని తన అధికారులను ఇదివరకే కోరినట్లు జగన్ పేర్కొన్నారు. తాను కూడా ఇక్కడకు త్వరలోనే వస్తున్నానన్న సీఎం.. ఇక్కడకు సీఎం రావాలంటే.. సిబ్బంది, భద్రతా సిబ్బంది అంతా రావాల్సి వస్తుందన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి విశాఖకు వచ్చేస్తానని, ఆ తర్వాత విశాఖలోనే ఉంటానని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.