వైకాపా నేతలు అధికారంలోకి రాకముందే రౌడీల్లా బెదిరింపులకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబువిమర్శించారు. విశాఖ జిల్లా సబ్బవరంలో నిర్వహించిన తెదేపా రోడ్‌షోకు సీఎం హాజరై.. ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. వైకాపాకు అధికారమిస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందన్నారు. అది జరగుకుండా తాను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఉన్నన్ని కేసులు దేశంలో ఏ రాజకీయ నేతపై లేవని విమర్శించారు. జగన్‌పై ఉన్న కేసులగురించి విశాఖ పార్లమెంట్ స్థానానికి జనసేన తరఫున పోటీ చేస్తున్న సీబీఐమాజీ జేడీ, విశ్రాంత ఐపీఎస్లక్ష్మీనారాయణ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల గల్లంతుకు సంబంధించి ఫారం-7 దరఖాస్తు దొంగలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 'కేసీఆర్, జగన్, మోదీ ముగ్గురూకలిసి నాటకాలు ఆడుతున్నారు. ముసుగులో దెబ్బలాట ఎందుకు.. దమ్ముంటే రండి తేల్చుకుందాం' అని సవాల్ విసిరారు.
విద్యాకేంద్రంగా సబ్బవరం
మళ్లీ అధికారంలోకి వస్తేవిశాఖ జిల్లా రూపురేఖలను మారుస్తామని సీఎం భరోసా ఇచ్చారు. అన్ని ఊళ్లను స్మార్ట్ గ్రామాలుగా చేస్తామని చెప్పారు. విశాఖలో మెడ్జోన్ పూర్తవుతోందని... 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సబ్బవరాన్నివిద్యాకేంద్రంగా తయారుచేస్తామన్నారు.