సరకుల తూకంలో వ్యత్యాసాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ జరిపారు. విశాఖ జిల్లా దేవరాపల్లి నిత్యావసర సరకుల గోదాములో.. తూనికల్లో తేడాలొస్తున్నాయని అందిన ఫిర్యాదుపై.. జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. తూకంలో తేడాలపై ప్రశ్నిస్తే.. తమపై కేసులు పెడతామని గోదాము ఇంఛార్జి బెదిరిస్తున్నారని.. రేషన్ డీలర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారుల బృందం డీలర్ల సమక్షంలో విచారణ చేపట్టారు.
గిడ్డంగిలో కాటాపై బియ్యం బస్తాలు తూకం వేయించారు. తూకంలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఆ కాటా స్థానంలో కొత్తది ఏర్పాటు చేసి, బియ్యం తూకం వేయించి.. రేషన్ డిపోలకు సరకులు పంపించారు. దీంతో సమస్య పరిష్కారమైంది.