Visakha Steel Plant Issue : ఏ భారీ పరిశ్రమనైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ చేస్తానంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆ పరిశ్రమను కొనాలని, సింగరేణిని బీజేపీ ప్రైవేట్ చేస్తానంటే తెలంగాణ ప్రభుత్వమే సింగరేణిని కొంటామని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు అన్నారు. విశాఖ సీఐటీయూ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వాలే కొన్నాయి :విశాఖ స్టీల్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వమే కొంటామని ప్రకటించడం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు ఆయన అన్నారు. కేరళలో హిందూస్థాన్ ప్రింటర్స్‌తో సహా రాష్ట్రంలోని ఏ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమైన అమ్ముతామని ప్రకటిస్తే కేరళ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని నిర్ణయించిందని, హిందూస్థాన్ ప్రింటర్స్‌ని కొని కేరళ రాష్ట్ర పభుత్వమే లాభాలతో నడిపిస్తోందని అన్నారు. తమిళనాడులోని సేలం స్టీల్‌ప్లాంట్, నైవేలీ లిగ్నైట్‌లను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిశ్రమలను తామే కొంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సేలం స్టీల్, నైవెలీ లిగ్నైట్‌ల అమ్మకాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు.
మౌనంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం : కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో లాలూచిపడి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొంటామని నేటికి ప్రకటించలేదని, బీజేపీని ఎదిరించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రజలు, కార్మికులు భావిస్తున్నారని అన్నారు. గత రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతామని పదే పదే ప్రకటిస్తున్నదని, 22 మంది ఎంపీలు ఉన్నా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం మౌనం దాల్చడంతో ఆయన ఆవేదన చెందారు. గత ఏడాది నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్ధ్యంతో నడపకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.