విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్‌లోని బ్లాక్ గోల్డ్ కంపెనీని వెంటనే తెరవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీ ఎదుట నిరసన చేశారు. ఈ నెల ఒకటో తేదీన సంస్థను మూసివేసిన కారణంగా.. కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ గోల్డ్ యాజమాన్యం, స్టీల్ ఎక్స్చేంజ్ కంపెనీ కలిసి కార్మికులకు ద్రోహం చేసేలా ఉన్నాయని సీఐటీయూ నాయకుడు రాంబాబు అన్నారు.
20 ఏళ్లుగా 120 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని… దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారు జీతాలు పెంచాలని అడిగినందుకు కంపెనీని మూసివేయటం దారుణమన్నారు. కార్మిక శాఖ కమిషనర్… వెంటనే కంపెనీని తెరిపించాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి.రమణ, తదితరులు పాల్గొన్నారు.