విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం పరిధిలోని మర్లగుమ్మి సాగునీటి కాలువలో కొన్నాళ్లుగా తుప్పలు, పూడిక పెరిగిపోయింది. జలాశయం నుంచి ఆయకట్టు కాలువకు సాగునీటిని విడుదల చేసినా.. పొలాలకు అంతంత మాత్రమే నీరు చేరుతుంది. రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ... వరినాట్లు వేశారు. అయినా కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందలేదు. నాట్లు వేసిన ప్రస్తుతం పొలాలకు నీరందక ఎండకు కళ్లముందే ఎండిపోతున్నాయి. అధికారులు మాత్రం సాగునీటి కాలువ పరిస్థితి పట్టించుకోలేదు.
రైతుల శ్రమదానం.. బాగుపడిన మర్లగుమ్మి కాలువ - farmers self service latest news
సాగునీటి కాలువ తుప్పలతో పూడుకుపోయింది. జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసినా.. నీరు మాత్రం ఆయకట్టు పొలాలకు చేరలేదు. ప్రస్తుతం ఎండలకు కళ్లముందే వరిపంట ఎండిపోతోంది. అధికారులు వస్తారు.. కాలువ అభివృద్ధి చేస్తారని ఆ రైతులు ఎదురు చూడలేదు. రైతులు అందరూ సమిష్టిగా చేయిచేయి కలిపి సాగునీటి కాలువలో పూడిక తీసి, అభివృద్ధి చేసుకున్నారు.
రైతుల ఇబ్బందులు గమనించిన మర్లగుమ్మి కాలువ నీటి సంఘం మాజీ అధ్యక్షుడు మహాలక్ష్మినాయుడు... రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, కాలువ అభివృద్ధి చేసుకుందామని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా మహాలక్ష్మినాయుడు ఆధ్వర్యంలో రైతులు అందరు సమష్టిగా కదిలి సాగునీటి కాలువలో పూడిక తీశారు. దిబ్బపాలెం, అడవి అగ్రహారం గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు మర్లగుమ్మి సాగునీటి కాలువలో దట్టంగా ఏర్పడిన తుప్పలు, పూడికను తొలగించారు. రెండు రోజులుగా ఆయకట్టు రైతులు శ్రమదానం చేసి.. దాదాపుగా మూడు కిలోమీటర్ల మేరకు కాలవలో తుప్పలు, పూడిక తొలగించి శుభ్రం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న సిమెంట్ లైనింగ్ పనులు పూర్తిచేసి, కాలువలో షట్టర్ ఏర్పాటు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక