విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 18న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని శ్రేణులను ఆదేశించారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా తెదేపా సిద్ధమని సోమవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. ‘తెలుగు ప్రజలు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును జగన్ తన కేసుల మాఫీకి ప్రైవేట్ పరం చేస్తూ.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. పోస్కోతో లోపాయికారీ ఒప్పందంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మిగులు భూమి ఎనిమిది వేల ఎకరాలను కాజేసేందుకు కేంద్రం ముందు మోకరిల్లారు. ఉద్యమస్ఫూర్తితో మరోసారి దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. జగన్ కుట్ర రాజకీయాలు తెలుగు ప్రజల ఉక్కు సంకల్పం ముందు సాగవు...’ అని పేర్కొన్నారు. చంద్రబాబు సోమవారం పల్లా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని నేతలను ఆదేశించారు. పల్లా చేపట్టిన నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. ప్రైవేటీకరణ ఆగే వరకు దీక్ష కొనసాగిస్తానని పల్లా నేతలకు తేల్చి చెప్పారు.
నేడు విశాఖకు చంద్రబాబు