RAILWAY ZONE: రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగడ డివిజన్‌ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే పార్లమెంటు వేదికగా ఈ రెండింటిపై ఇచ్చిన హామీలను పక్కనపెట్టాలని అస్యూరెన్సెస్ కమిటీని కోరడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై 2020 మార్చి 18న లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైకాపా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, 2021 మార్చి 24న తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ... ‘విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఓఎస్‌డీ, తూర్పుకోస్తా రైల్వేలు సమర్పించాయి.
ప్రస్తుతం అవి రైల్వేబోర్డు కార్యాలయ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండింటి ఏర్పాటు అంశాన్ని రూ.170 కోట్ల అంచనాతో 2020-21 బడ్జెట్‌లో చేర్చాం’ అని పేర్కొన్నారు. కొత్త జోన్ల ఏర్పాటువల్ల రైల్వే కార్యకలాపాల నిర్వహణ, సామర్థ్యం ప్రభావితం అవుతుంది కాబట్టి అదనపు వనరులు అవసరమని, అందువల్ల డీపీఆర్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి సభాముఖంగా ఇచ్చిన హామీలను ఆయా మంత్రిత్వశాఖలు 3 నెలల్లోపు అమలు చేయాలి. ఇందులో ఉన్న సంక్లిష్టతలవల్ల అది సాధ్యం కాలేదు కాబట్టి ఆ హామీని పక్కనపెట్టాలని రైల్వేశాఖ కోరింది.