Vizag Steel Plant Padayatra: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర పాలకుల రెండు నాల్కల ధోరణి మరోసారి బహిర్గతమైంది. సంస్థను ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. ఉక్కు శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పూటకో మాట మారుస్తున్నారంటూ మండిపడ్డాయి. కేంద్రం దిగొచ్చేవరకు తాము ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గందరగోళం నెలకొన్న వేళ కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని ఉక్కు శాఖ ప్రకటన వెలువరించింది. ఆర్ఐఎన్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేవని.. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉందని వెల్లడించింది. విశాఖ స్టీల్స్ పనితీరును మెరుగుపరిచి, దాన్ని నిలబెట్టడానికి ఆర్ఐఎన్ఎల్ ప్రయత్నాలు చేస్తోందని.. అందుకు ప్రభుత్వం మద్దతిస్తోందని పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ విధానం కింద ప్రభుత్వరంగ సంస్థలను స్ట్రాటెజిక్, నాన్‌స్ట్రాటెజిక్ సెక్టార్లుగా కేంద్రం విభజించింది. నాన్‌స్ట్రాటెజిక్ విభాగంలోని ప్రభుత్వ సంస్థలను సాధ్యమైన చోట ప్రైవేటీకరించాలని.. లేదంటే మూసేయాలని నిర్ణయించింది. విశాఖ ఉక్కును.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో విలీనం చేయాలన్న విజ్ఞప్తులనూ కేంద్రం తోసిపుచ్చింది. నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం ప్రకారం.. ఆర్ఐఎన్ఎల్ను ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విలీనం చేయడం కుదరదంటూ.. పదే పదే పార్లమెంటుకు చెబుతూ వస్తోంది.
ఉద్యమ కార్యచరణ ప్రకటించిన కార్మికులు : కేంద్ర ప్రభుత్వ తీరుపై ఉక్కు పోరాట కమిటీ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకే కేంద్రం నాటకాలని నాయకులు మండిపడుతున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇవాళ కూర్మన్నపాలెం నుంచి సింహాచలం అప్పన్న దేవస్థానం వరకు పాదయాత్ర చేయనున్నారు. 25న ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అధికార బంగ్లాను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు కార్మికులు కూడా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రాణాలకు తెగించైనా పరిశ్రమను కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.