ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ దుర్ఘటనపై కేంద్ర రసాయన నిపుణుల కమిటీ పరిశీలన

By

Published : May 22, 2020, 7:24 AM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్​ పరిశ్రమలో గ్యాస్ లీక్​కు స్టైరీన్ ట్యాంక్​లో అధికంగా ఉష్ణోగ్రత పెరగటమే కారణమని కేంద్ర రసాయన నిపుణులు భావిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ మీటర్​లో 30 డిగ్రీల ఉష్ణోగ్రతగానే నమోదు కావటంతో కారణాలు విశ్లేషిస్తున్నారు.

gas leak
గ్యాస్ లీక్​పై నిపుణుల అధ్యయనం

ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ లీకేజ్‌ దుర్ఘటనకు ట్యాంకులో 130 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే కారణమని కేంద్ర రసాయన నిపుణుల (కెమికల్‌ ఎక్స్‌పర్ట్స్‌) కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు స్టైరీన్‌ ట్యాంకులో ఉష్ణోగ్రత సుమారు 130 డిగ్రీల వరకు ఉంది. కానీ ఉష్ణోగ్రతలు సూచించే మీటర్‌లో మాత్రం 30 డిగ్రీలే కనిపించింది. ఇలా జరగటానికి కారణమేమిటనే అంశంపై కేంద్ర రసాయన నిపుణుల కమిటీ విశ్లేషిస్తుందని ఒక అధికారి తెలిపారు. సాంకేతిక లోపం ఉందా? వాతావరణంలో మార్పుల కారణంగా ప్రమాదం జరిగిందా? అనే అంశాలపై నివేదిక త్వరలో అందే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. ట్యాంకులో ఉష్ణోగ్రతలు తగ్గించటానికి స్ప్రింక్లర్లు వినియోగించినా ఉష్ణోగ్రతలు ఎందుకు తగ్గలేదనే అంశాన్ని కూడా కేంద్ర కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. కమిటీ నివేదిక కొద్దిరోజుల్లో ప్రభుత్వానికి అందే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

నివేదిక రూపొందిస్తున్నాం: ఉన్నతస్థాయి కమిటీ ఛైర్మన్‌
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై నివేదిక తయారు చేస్తున్నట్లు సంఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఛైర్మన్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. ‘ప్రమాదానికి కారణాలపై కమిటీ సభ్యులతో కలిసి అధ్యయనం చేశాం. ఇదే అంశంపై వివిధ ఏజెన్సీలు నివేదికలు రూపొందించాయి. మా విజ్ఞప్తి మేరకు సమీప గ్రామాల ప్రజలు.. ప్రమాదానికి కారణాలు, పరిశ్రమకు సంబంధించిన ఇతర అంశాలపై ఈమెయిల్‌ ద్వారా సమాచారం పంపుతున్నారు. వీటితోపాటు వివిధ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల్లోని సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాం. దీన్ని మా నివేదికలో పొందుపరుస్తాం. ఇప్పటికే సంఘటనపై కమిటీ సొంతంగా అధ్యయనం చేసి ప్రమాదానికి కారణాలు గుర్తించింది. ప్రభుత్వం ఇచ్చిన నెలరోజుల గడువులోగా నివేదిక అందజేసే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని వివరించారు.

ఇదీ చదవండి:పీజీ వైద్య విద్య ఫీజలు తగ్గే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details