ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంధ్రుల హక్కు'కు ముప్పు తప్పదా?.. గనులు కేటాయించి సమస్య పరిష్కరించలేరా?!

32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు ఆవిర్భవించింది. అప్పట్లో విశాఖ ఉక్కు కోసం చేసిన ఉద్యమాలకు కేంద్రం సైతం దిగి వచ్చింది. అటువంటిది ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు సర్కారు యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

vishaka steel plant
విశాఖ ఉక్కు కర్మాగరం

By

Published : Feb 5, 2021, 7:01 AM IST

విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు... అంటూ నలుదిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం... పోరుబాట పరిణామాల్లో ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు... విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నేలకు అందించాయి. ఇప్పుడు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది ఒప్పంద సిబ్బందితో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా అలరారుతోంది. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఉక్కు కర్మాగారమే. అంతటి ఘనత వహించిన పరిశ్రమను ప్రైవేటుపరం చేయడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాణాలొడ్డి సాధించుకున్న ‘హక్కు’ విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది.

విశాఖ ఉక్కు కర్మాగరం

ఆ రోజుల్లో....

దేశంలో అప్పటికే 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. 1963లో తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. నిపుణులు అధ్యయనం చేసి విశాఖపట్నం మేలని తేల్చారు. ఆ తర్వాతే రాజకీయం మొదలైంది. ఉక్కు కర్మాగారాన్ని తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్రాలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అవకాశం ఆఖరు నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. దీనిపై తొలుత చిన్నపాటి ఆందోళనలే జరిగాయి.

మళ్లీ అలజడి

శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న అప్పటి ప్రధానిమంత్రి ఇందిరా గాంధీ, పక్కన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి

ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు మొదలు పెట్టకపోవడంతో మళ్లీ అలజడి రేగింది. ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

ఇదీ ఘనత...

* 1971 జనవరి 20న శంకుస్థాపన
* 64 గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల సేకరణ
* కర్మాగారం నిర్మాణం పూర్తికి పట్టిన సమయం 20 ఏళ్లు
* 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా జాతికి అంకితం

అమృతరావు చొరవతో...

విశాఖ కలెక్టరేట్​ ముందు నిరాహార దీక్ష చేసిన అమృతరావు

గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతరావు అనే వ్యక్తి గుంటూరు నుంచి వచ్చి విశాఖ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరాహారదీక్షకు దిగారు. ఈ పరిణామంతో ఉద్యమంలో కదలిక మొదలైంది. విశాఖపట్నంలో పోరాటం ఊపందుకుంది. 1966లో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన ‘అఖిలపక్ష సంఘం’ ఏర్పడింది. ఓ వైపు అమృతరావు నిరాహార దీక్ష... మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు కొనసాగాయి. ఉద్యమం రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం యువకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. కొన్నిచోట్ల పోలీసుస్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం, రైల్‌రోకోలు, రాస్తారోకోలకు దిగడం తదితర కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హింసాత్మక ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఆందోళనల్లో మొత్తం 32 మంది మృత్యువాత పడినట్లు అధికారికంగా తేల్చారు.

దిగివచ్చిన కేంద్రం

ప్పటి రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతగా కట్టడి చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు. ప్రజల పోటటానికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. కొందరు తమ శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యతాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. మరోపక్క నిరాహారదీక్షలో కూర్చున్న అమృతరావు ఆరోగ్యం క్షీణించింది. ఆయన మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబరు 3న విశాఖ వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపి, అమృతరావుతో దీక్ష విరమింపజేశారు.

భూముల విలువే లక్ష కోట్లు

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ


కర్మాగారం భూముల విలువ రూ.లక్ష కోట్లకు పైనే. అంతటి విలువైన భూమిని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదు. గనులు కేటాయిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. - ఇ.ఎ.ఎస్‌.శర్మ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, విశాఖపట్నం

కాపాడుకోవాలి

వై.శివసాగరరావు, విశ్రాంత సీఎండీ

వేలాది మంది సామాన్య, మధ్యతరగతి వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న భారీ ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి పరిష్కరించాలి. - వై.శివసాగరరావు, విశ్రాంత సీఎండీ, విశాఖపట్నం

ఇదీ చదవండి:

విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్​లోనూ చిన్న చూపే

ABOUT THE AUTHOR

...view details