Cargo Services at Airports Have Stopped: దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో కార్గో సేవలు నిలిచిపోయాయి. అనుమతులు పునరుద్ధరించుకోవాలని బీసీఏఎస్ ఆదేశించినప్పటికీ..గడువులోగా అనుమతులు తెచ్చుకోకపోడంతో సరుకు రవాణా సేవలు స్తంభించాయి. సరకు రవాణా సేవలను పర్యవేక్షించే భారత విమానయాన సంస్థకు చెందిన కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ నిర్లక్ష్యం వల్లే.. గడువులోగా అనుమతులు తెచ్చుకోలేకపోయామని.. కార్గో ఆపరేటర్లు పేర్కొంటున్నారు. విమానాశ్రయాల్లో సరకు రవాణా సేవలు అందించే సంస్థలు ఇప్పటివరకూ కామన్ యూజర్ డొమెస్టిక్ కార్గో టెర్మినల్ ఆపరేటర్లుగా ఉండేవి.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో తాజాగా సీయుడీసీటీ ఆపరేటర్ల అనుమతులు రద్దు చేశారు. సరకు రవాణాలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగు పరుస్తూ రెగ్యులేటరీ ఏజెన్సీ వ్యవస్థను బీసీఏఎస్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ సీయుడీసీటీ గా సేవలు అందిస్తున్న కార్గో నిర్వహణ సంస్థలు.. రెగ్యులేటరీ ఏజెన్సీ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీఏఎస్ సూచించింది. దీనికోసం ఏఏఐ క్లాస్‌తో మళ్లీ కొత్తగా ఒప్పందం సవరించుకుని.. ఆ పత్రాలను తీసుకురావాలంటూ బీసీఏఎస్ ఆరు నెలల కిందట ఆదేశించింది.
కొత్త ఒప్పంద పత్రాల కోసం గత ఆరు నెలలుగా ఏఏఐ క్లాస్‌ను కార్గో ఆపరేటర్లు సంప్రదిస్తున్నారు. కానీ..ఏఏఐ క్లాస్ సిబ్బంది తీవ్ర జాప్యం చేసి పది రోజుల కిందటే కొత్తగా సవరించిన పత్రాలను ఇచ్చారు. వాటితో రెగ్యులేటరీ ఏజెన్సీ కోసం విమానాశ్రయాల్లోని కార్గో నిర్వాహకులు ఇప్పటికే బీసీఏఎస్ కు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ.. అనుమతులు వచ్చేందుకు కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుంది. ఆరు నెలలు సమయం ఇచ్చినా.. రెగ్యులేటరీ ఏజెన్సీగా మారకపోవడంతో దేశంలోని 20 విమానాశ్రయాల్లో ఆదివారం నుంచి కార్గో సేవల అనుమతులు నిలిపేస్తున్నట్టు బీసీఏఎస్ ప్రకటించింది.