విశాఖ జిల్లాలో 4952 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటికి నెలకు పన్నెండున్నర లక్షల లీటర్ల టెట్రా పాక్ పాలు సరఫరా చేయాలి. ప్రతి నెలా మొదటి వారం, మూడో వారంలో రెండు ధపాలుగా కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఆగస్టు నెలలో యాభై శాతం కేంద్రాలకు ఒక్కసారి కూడా పాలను పంపలేదు. పన్నెండున్నర లక్షల లీటర్లకుగాను.. ఇప్పటివరకూ నాలుగు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేయగలిగారు. ఫలితంగా ఈనెలలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు.. అంగన్వాడీ పాలు పొందే అవకాశం కనిపించటం లేదు.
అందుబాటులోకి యాప్.. కానీ..
అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన పాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ సంస్థ.. జులై నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్‌ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఉద్దేశం మంచిదే అయినా ప్రయోగత్మకంగా అమలు వంటివి చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా సరఫరాలో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు. పైగా డెయిరీ నుంచి లబ్ధిదారుల వరకు పాలు చేర్చే క్రమంలో మూడు దశల్లో.. రవాణాదారులు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. కేంద్రాల వారీగా పాల వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. దీంతో పాల సరఫరా కంటే.. యాప్‌లో వివరాల నమోదుకు సమయం ఎక్కువ పడుతుందని సరఫరాదారులు చెబుతున్నారు.