ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు.. - నాతవరంలో రోడ్డు ప్రమాదం

అమ్మా... కారు డ్రైవింగ్‌ నేర్చుకుంటామని చెప్పి గడప దాటిన అన్నదమ్ములు మళ్లీ తిరిగిరాలేదు. అర్ధరాత్రి వేళ కారు డ్రైవింగ్‌ నేర్చుకునే ప్రయత్నం చేయడం... ఆ సమయంలో నిద్రమత్తు తోడవడం వారి నిండు జీవితాలను బలితీసుకుంది. అందివచ్చిన కొడుకులు అందరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

brother died in car accident at nathavaram
కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు..

By

Published : Sep 11, 2020, 8:20 AM IST

విశాఖ జిల్లా నాతవరం సమీపంలో గురువారం తెల్లవారుజాము 3 గంటలకు కారు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో అన్నదమ్ములు మృతిచెందారు. నాతవరం గ్రామానికి చెందిన ఆశపు చిన్నబ్బాయి, మాణిక్యం దంపతులకు శ్రీనివాస్‌ (29), సాయి (24) ఇద్దరు కుమారులు. గ్రామం కూడలిలో ఉన్న చిన్న కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతో ఇద్దరు కుమారులను డిగ్రీ వరకూ చదివించారు. ఈ మధ్యనే పెద్దకుమారుడు విశాఖలోని ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగానికి కుదిరాడు. బుధవారం ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ తన స్నేహితుడైన వంశీని కారు డ్రైవింగ్‌ నేర్పాలని కోరాడు. పగలైతే ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ ఎక్కువ ఉంటుందని రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తాండవ కూడలి వైపు కారుతో వెళ్లారు. తాను కూడా వస్తానంటూ సోదరుడు సాయి వీరితో వెళ్లాడు.

వంశీ వాహనం నడుపుతూ పక్క సీట్లో శ్రీనివాస్‌ను కూర్చోబెట్టుకుని డ్రైవింగ్‌ ఎలా చేయాలో చెబుతూ ఇదే రోడ్డులో ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 2 గంటల సమయంలో నిద్రమత్తులో అగ్రహారం వద్ద మలుపులో ఉన్న జీడిచెట్టును కారు బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముందు సీటులో ఉన్న శ్రీనివాసు (29), వెనుక సీటులో ఉన్న సాయి (24) మృతి చెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న వంశీకి (22) తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 4 గంటల సమయంలో వేకువ నడక కోసం వెళ్లినవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను వెలికితీశారు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వంశీ కొన ఊపిరితో ఉండటంతో విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు.

తమ బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు. ఇద్దరు కొడుకులను ఒకేసారి పోగొట్టుకున్నామంటూ విలపిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి వల్లా కాలేదు. వారి కడుపుకోత చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.

ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details