విశాఖ జిల్లా సాగరతీరంలో విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సముద్ర స్నానానికి స్నేహితులతో కలిసివెళ్లి.. ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. జ్ఞానాపురానికి చెందిన 8 మంది పిల్లలు కోస్టల్ బ్యాటరీ ఎదురుగా ఉన్న సాగరతీరంలో స్నానానికి దిగారు. అలల ఉద్ధృతికి యశోవర్దన్, రోహిత్ కొట్టుకుపోగా.. మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. వారంతా గట్టిగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ లోపే పిల్లలు సముద్ర గర్భంలోకి కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు చీకటిపడే వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం తిరిగి గాలించనున్నారు. మృతి చెందిన పిల్లల బంధువులు సముద్రతీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.