విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయంలో నాటు పడవ బోల్తా పడింది. బేతపూడి గ్రామానికి చెందిన దారపు ఈశ్వరరావు మృతి చెందాడు. ఆయన ఆదివారం సాయంత్రం రైవాడ జలాశయం లోకి చేపల వేటకు పడవపై వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి.. జలాశయంలో గల్లంతయ్యాడు.
ఆదివారం రాత్రికి ఈశ్వరరావు ఇంటికి రాకపోవటంపై.. కుటుంబ సభ్యులు జలాశయం ప్రాంతంలో వెతికినా.. ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం నుంచి గాలించిన అతని స్నేహితులు.. సాయంత్రానికి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య, పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.