BJP SATYA KUMAR ON JAGAN : అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పేవన్నీ అసత్యాలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. జగన్ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారుస్తూ వైకాపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవుతోందని ధీమా వ్యక్తం చేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. కొత్తవి రాకపోగా.. ఉన్న చక్కెర మిల్లును కూడా మూసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం అభివృద్ధి సాధించారని వైకాపా నేతలు సమావేశం ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చారని.. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని.. మూడున్నరేళ్లైంది ఏ ప్రాజెక్టు పూర్తిచేశారో చెప్పగలరా అని నిలదీశారు.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారుస్తూ కొత్త నాటకం
"ప్రజల దృష్టి మరల్చేందుకే వైకాపా నాటకాలు ఆడుతోంది. మూడున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? కొత్తవి రాకపోగా.. చక్కెర మిల్లును కూడా మూసివేయించారు. ఏం సాధించారని వైకాపా నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై మూడున్నరేళ్లైంది ఏ ప్రాజెక్టు పూర్తిచేశారో చెప్పగలరా? అభివృద్ధి అంటే పేర్లు, ఊర్లు మార్చడమేనా? పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదు. పుట్టబోయే బిడ్డ పేరు కూడా మార్చాలని చెబుతారేమో" - సత్యకుమార్, భాజపా నేత
అభివృద్ధి అంటే పేర్లు, ఊర్లు మార్చడమేనా అని.. పేర్ల పిచ్చి పార్టీని చూడలేదని విమర్శించారు. పుట్టబోయే బిడ్డ పేరు కూడా మార్చాలని చెబుతారేమో అని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డుదారులకు బియ్యం ఎందుకు అందట్లేదని.. ఆ బియ్యం ఎక్కడికి పంపుతున్నారో చెప్పండని నిలదీశారు. కనీసం బియ్యం కూడా సరఫరా చేయలేనివారు అభివృద్ధి చేస్తున్నామంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కోసం కేంద్రం నిధులు కేటాయిస్తోందని.. వాటిని లబ్ధిదారులకు కేటాయించే తీరిక లేదా అని ప్రశ్నించారు. పేదలకు అండగా నిలవాల్సిందిపోయి.. దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: