విశాఖ జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే భోగి మంటలు వేసుకుని.. ప్రజలు సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా వేడుకలు చేసుకున్నారు.
విశాఖలో...
విశాఖ శ్రీ శారదాపీఠంలో సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. భోగి సందర్భంగా పీఠం ప్రాంగణంలో మంటలు వేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పూజలు చేశారు. పీఠం నిర్వహణలోని శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు, సిబ్బంది సాంప్రదాయబద్ధంగా భోగి మంటల్లో పిడకలు వేశారు.
పిల్లలకు భోగిపళ్లు పోయటం వల్ల దిష్టి పోయి.. ప్రకాశిస్తూ, ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డాక్టర్ రవిరాజు అన్నారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో.. నగరంలోని మహారాణి పేట ప్రకృతి చికిత్సాలయంలో పిల్లలకు భోగి పళ్లు పోశారు.
చోడవరంలో...
చోడవరంలోని స్వయంభూ వినాయక ఆలయం వద్ద 400 మంది పేదలకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దుప్పట్లు పంపిణీ చేశారు. పలువురు దాతలు ఆర్థిక సాయంతో.. ఏటా భోగి పండుగ రోజున పేదలకు వస్త్రదానం చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. దేవాదాయ శాఖ అధికారులు, వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.