తెదేపా ప్రభుత్వ హయాంలో జీ ప్లస్ త్రీ గృహాల నిర్మాణం నిమిత్తం దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గృహ పత్రాలు అందజేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని కరక రోడ్డు సమీపంలో 2,448 ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 624 ప్లాట్లు నేటికీ పునాది స్థాయిలోనే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అకారణంగా రద్దు చేసింది. డిపాజిట్లు చెల్లించిన వారికి డబ్బులు వాపస్ చేసి సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు.
రద్దైన 624 ప్లాట్లలోని జాబితాలో అర్హులు ఉంటేనే స్థలం మంజూరు చేస్తారని లేనిపక్షంలో డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జరిపిన సర్వేలో సుమారు రెండు వందల మంది పైగా అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించ లేదు. గతంలో అర్హులుగా గుర్తించి గృహ మంజూరు పత్రాలు ఇచ్చి.. ఇప్పుడు అనర్హులుగా ఎలా పరిగణిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.