విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో మత్స్యకారులు అందోళనకు దిగారు. అభివృద్ది పేరిట రోడ్డు విస్తరణ పనులు చేపట్టి మత్స్యకారులను తీరానికి దూరం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. భీమునిపట్నం తీరంలో 2020-21 సంవత్సరానికి 66 అడుగులు, 2020-41 సంవత్సరానికి 72 అడుగుల రోడ్డు విస్తరణ చేయాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. 66 అడుగుల రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పినపుడే వ్యతిరేకించామని, 72 అడుగులకు ఎలా పెంచుతారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.
ఏళ్ల తరబడి గంగమ్మ తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నమని హుద్‌హుద్ లాంటి ఎన్నో ఉపద్రవాలు ముంచుకొచ్చినా బీచ్ తీరాన్ని, గంగమ్మ తల్లిని వదలకుండా ఉన్నామని, ప్రస్తుతం రోడ్డు అభివృద్ధి పేరిట దూరం చేయడం సరి కాదన్నారు. వుడా మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీరానికి దగ్గరలో ఉంటే విపత్తులు, ఉపద్రవాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించి వలలు, పడవలు ఇతర సామగ్రిని కాపాడుకోగలగుతామని.. తీరానికి దూరంలో ఉంటే కాపాడుకోలేక ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్ తీరంలో చారిత్రక కట్టడాలు, పార్కులు ఉన్నాయని.. వాటిని తెలుసుకుకోకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో కార్యాలయంలో ఉండి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. స్థానిక పరిస్థితులను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న రహదారినే కొనసాగించాలని రహదారి విస్తరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ముక్తకంఠంతో మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.సముద్రం కోతకు గురికాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేసారు.
ఇది చదవండి:Corona: కొవిడ్ శ్వాసకోశ వ్యవస్థపైనే కాదు... నాడులపైనా దాడి చేస్తోంది!