Beach cleaning punishment: ఇక్కడ కనిపిస్తున్న వీరంతా సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖ సాగర తీరాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన వారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. వీరంతా మద్యం అతిగా సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డ నిందితులు. విశాఖ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ వారిని ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరచగా వాళ్ల గురించి న్యాయమూర్తి కాస్త ఆలోచించి ఏమి చేస్తే వీరిలో మార్పు వస్తుందా అని వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి జరిమానా విధిస్తే సరిపోదని భావించిన న్యాయమూర్తి.. వారిలో పరివర్తన వచ్చేలా, అలాగే అందరికీ ఉపయోగపడేలా ఏదైనా శిక్ష విధించాలని భావించారు.
అందులో భాగంగా అందరిని సాగర తీరంలో ఉన్న వ్యర్థాలను ఏరివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో సుమారు 52 మంది ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న సాగర తీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించే పనిలో పడ్డారు. వీరు సక్రమంగా చెప్పిన పని నిర్వర్తించేలా చూసుకునే బాధ్యతను ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. మండుటెండలో చెత్త ఏరే పని నిర్వహిస్తే వారిలో కొంచమైనా మార్పు వస్తుందని న్యాయమూర్తి శిక్ష విధించినట్లు తెలుస్తోంది.