ORGAN DONATION : చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసే దాతల పెద్దమనసు పలువురు బాధితులకు వరంగా మారుతోంది. శరీరంలోని అవయవాల మార్పిడి ద్వారా రోగి ప్రాణాలనూ కాపాడుతోంది. సామాజిక స్పృహ కలిగిన కొద్ది మంది తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పటికీ మరికొందరు.. పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా బ్రైయిన్ డెడ్ అయిన చనిపోయిన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం.. మరో బాలుడి జీవితాల్లో వెలుగులు నింపనుంది.
ఈ నెల 16వ తేదీన విశాఖలో రోడ్డు ప్రమాదానికి గురైన సన్యాసమ్మ(48) అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మహిళ గుండెను తిరుపతి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఎస్కార్ట్ వాహనాలతో పాటు రహదారి వెంబడి 120 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్ కూడలి మీదుగా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా 22 నిమిషాల్లో గుండెను ఆస్పత్రికి చేర్చినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లాకు చెందిన 15 సంవత్సరాల బాలుడికి గుండె మార్పిడి చికిత్స చేయనున్నారు.