ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగ్లాదేశ్ నౌక ఆతిథ్యం ఇవ్వనుందా? - bangladesh ship in vizag latest news

వాయుగుండం కారణంగా విశాఖకు కొట్టుకు వచ్చిన బంగ్లాదేశీ ఓడను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెన్నేటి పార్కు వద్దే ఓడను ఉంచి, రెస్టారెంట్​గా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

ship into hotel
బంగ్లాదేశ్ నౌక

By

Published : Dec 17, 2020, 7:45 AM IST

విశాఖలో తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకు వచ్చి నిలిచిపోయిన ఓడను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి, రెస్టారెంట్​గా మార్చేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.

తీవ్ర వాయుగుండం కారణంగా అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్​కు చెందిన వాణిజ్య నౌక ఎంవి హెచ్ టి 194 కార్గో కొట్టుకు వచ్చింది. తీరానికి దగ్గరలో రాళ్లు, ఇసుకలో కూరుకుపోవటంతో, ఓడను తిరిగి జలాల్లోకి తీసుకు వెళ్లేందుకు వైజాగ్ పోర్టు ట్రస్టు ప్రయత్నాలు చేసింది. కార్గో నౌకను తిరిగి నీటిలోకి పంపేందుకు భారీ మెుత్తంలో ఖర్చు కానుండటంతో, ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.

కొట్టుకు వచ్చిన ఈ నౌకను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, హోటల్​గా మార్చాలని భావించింది. ఈ విషయంపై సచివాలయంలో ఏపీ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ అధికారులతో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​ చర్చలు జరిపారు. ఓడ యజమానితో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.

ఓడను కొనుగోలు చేసిన తరువాత పర్యటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపైన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఓడ క్వార్ట్జ్, ఫ్లై యాష్​ను రవాణా చేస్తుంది. హోటల్​గా మార్చేందుకు, అంతర్గత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 80 మీటర్ల పొడవైన ఈ నౌకలో గదుల తరహా కంపార్ట్​మెంట్లు నిర్మాణానికి పెద్ద మెుత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ

ABOUT THE AUTHOR

...view details