ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊళ్లకు నిధులు.. ఇళ్లకు నీళ్లు! - విశాఖ తాజా వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం)కు శ్రీకారం చుట్టింది. 2024 నాటికి పల్లెల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ద్వారా తాగునీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. తలసరి 55 లీటర్ల చొప్పున నీటిని సరఫరాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తాగునీటిని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. దీనికి అవసరమైన నిధులను కేంద్రం 80 శాతం, రాష్ట్రం 10 శాతం, గ్రామ కమిటీలు 10 శాతం చొప్పున సమకూర్చనున్నాయి.

Authorities are making arrangements to provide tap water to households in Visakhapatnam district.
జలజీవన్ మిషన్

By

Published : Oct 4, 2020, 9:50 AM IST

విశాఖ జిల్లాలో రక్షిత తాగునీరు లభించకపోవడం వల్లే వేలాదిమంది వ్యాధుల బారిన పడుతున్నారన్నది సుస్పష్టం. దీన్ని నివారించడానికి సురక్షితమైన జలం అందించాలనే లక్ష్యంతో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఏడాది పొడవునా నీటి లభ్యత ఉన్న జలాశయాలు, నీటి వనరులను గుర్తిస్తారు. వాటిని ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు అనుసంధానం చేసి ఇంటింటా కుళాయి ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం గృహాలకు తాగునీటి సదుపాయం కల్పించడానికి సుమారు రూ.700 కోట్లతో ప్రతిపాదనలను కలెక్టర్‌ ఆమోదంతో పంపించారు. నాలుగేళ్లలో పథకం పూర్తయ్యేలా ఏటా 1.5 లక్షల నుంచి రెండు లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ ఏడాది లక్ష్యం చేరేనా?

గ్రామీణ జిల్లాలో 5.99 లక్షల గృహాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 90,736 గృహాలకే కుళాయి కనెక్షన్లున్నాయి. మిగతా ఇళ్లకు వీధి కుళాయిలు, చేతిబోర్లు నుంచే తాగునీరు అందుతోంది. మన్యంలో ఆ తాగునీటి సదుపాయం కూడా తక్కువే. కొండలు, గెడ్డల నుంచి ఊటనీటిని వాడుకుంటున్నారు. దీనివల్లే అక్కడ ఎక్కువగా అతిసారం, టైఫాయిడ్‌ ఇతర వ్యాధులకు గురవుతున్నారు. రక్షిత నీటినే అందరికీ అందుబాటులోకి తేవాలంటే సుమారు 5.08 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటిగా 2020-21లో 2.22 లక్షల ఇళ్లకు కుళాయిలు అందివ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఏడాది లక్ష్యం సాధించే అవకాశం కనిపించడం లేదు. పూర్తిస్థాయిలో తాగునీటిని అందించే గ్రామాలు.. నిధులు అందుబాటులో ఉన్న పంచాయతీల్లో ముందుగా ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 12 వేల కనెక్షన్లు మాత్రమే అందివ్వగలిగారు.

వారంలోనే నిధులు..

జల్‌జీవన్‌ మిషన్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించిన నిధులు వారంలోపు మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న నిధులతో కొన్ని గ్రామాల్లో ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేస్తున్నార. మొదట నీటి వనరుల లభ్యత ఉన్న గ్రామాలనే ఎంపిక చేసుకుంటాం. ట్యాంకులు నిర్మించడానికి అవకాశం లేదు. నిధులు వచ్చిన వెంటనే అన్నిచోట్లా పనులు మొదలుపెడతాం. - రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎస్‌ఈ

ఇదీ చదవండి:శనగ రైతుకు రాయితీ కష్టం.. విత్తనాలు అందక అవస్థలు

ABOUT THE AUTHOR

...view details