ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యానికే అగ్రస్థానం. ఆధునిక పరిజ్ఞానంపై పట్టు ఉంటేనే కొలువుల సాధన సాధ్యమవుతుంది. అందుకే విద్యాలయాలు సైతం నైపుణ్య బాటపట్టాయి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ), సీమెన్స్ కంపెనీ సంయుక్తంగా విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేసి... పరిశ్రమలకు అవసరమైన విద్యలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్న ఎక్స్‌లెన్స్ సెంటర్లో... సుమారు 6 వేల మంది విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.
అత్యాధునిక పరికరాలతో శిక్షణ
పరిశ్రమల్లో వినియోగించే పరికరాలను సీమెన్స్ కంపెనీ ఈ కేంద్రంలో ఏర్పాటుచేసింది. ఇక్కడ రోబోటిక్ ఆపరేటింగ్ టెక్నాలజీ, ఆటోమేషన్, సీఎన్సీ ప్రోగ్రామింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎనర్జీ స్టడీస్ ల్యాబ్, మెకట్రానిక్స్ ల్యాబ్, ప్రాసెస్ ఇన్ట్ర్సుమెంటేషన్ ల్యాబ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ వ్యాలిడేషన్ ల్యాబ్ అందుబాటులో ఉంచారు. అత్యంత ఖరీదైన త్రీడీ ప్రింటర్‌ను సైతం ఈ కేంద్రంలో ఉంచారు.