బైండోవర్కు ఏయూ కీచక ప్రొఫెసర్లు
విద్యార్ధినిలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులో తీసుకున్నారు విశాఖ పోలీసులు. వారిని ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినట్లు నగర శాంతి భద్రతల డీసీపీ రంగారెడ్డి తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు ప్రొఫెసర్‌ల ప్రవర్తనపై విద్యార్థినులు చేసిన ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు... వారిని అదుపులో తీసుకున్నారు. అనంతరం వారిని ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినట్లు నగర శాంతిభద్రతల డీసీపీ రంగారెడ్డి వెల్లడించారు. ఏయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ ఆఫ్ లివింగ్ రిసోర్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కె. రమేష్ బాబుపై 498ఏ కేసుతోపాటు అక్రమ సంబంధం ఆరోపణలున్నాయని తెలిపారు. 498ఏ కేసు ఇంకా విచారణలో ఉందన్నారు. సోషల్ వర్క్ విభాగాధిపతి రాగాల స్వామిదాస్.. స్కాలర్స్ పట్ల ద్వందార్థ మాటలతో వేధిస్తున్నారనే ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ విషయంలో సుమోటోగా కేసు తీసుకొని ఇద్దరు ప్రొఫెసర్లను సీఆర్‌పీసీ 41 /109 సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నామన్నారు. ర్యాగింగ్ జరపకుండా కౌన్సిలింగ్ చేయాల్సిన ఆచార్యులే పోలీసుల ద్వారా, ఎమ్మార్వో ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. అత్యున్నత సంస్థలో పనిచేసే వారు దిగజారి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి సమస్యలున్నా విద్యార్థులు, పరిశోధకులు పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీసీపీ రంగారెడ్డి తెలిపారు.