ATM THEFT GANG ARREST: చిన్నపాటి సాంకేతిక లోపాన్ని గమనించి విశాఖలోని బ్యాంకు ఏటీఎంల నుంచి దొంగలు 9.49 లక్షల రూపాయలను దోచేశారు. మొత్తం ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ భరార్‌పుర్ ప్రాంతానికి చెందిన షారూక్ 2017 నుంచి విశాఖలో చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడు గత నెల 30న అదే రాష్ట్రానికి చెందిన రషీద్(24), ముస్తకీమ్(21), సాయికూల్(25)తో కలిసి నగరానికి విమానంలో వచ్చి ఓ లాడ్జిలో బస చేశారు.
ఎలా చేశారు: వీరంతా తమ ప్రాంతానికే చెందిన కొందరితో కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంకులో ఖాతాలు తెరిపించి డెబిట్ కార్డులను తమ వద్దే ఉంచుకున్నారు. వారితో కొంత నగదు అకౌంట్లలో వేయించి.. తర్వాత తమ చోరీ ప్రణాళిక అమలు చేస్తారు. ముందుగా ఆ బ్యాంకు అనకాపల్లి బ్రాంచి ఏటీఎంలో వారు తమ పథకాన్ని అమలు చేశారు. నగదు విత్‌డ్రాకు కార్డు పెట్టిన తర్వాత డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం యంత్రం పవర్ బటన్‌ను ఆపేసి వెంటనే ఆన్ చేస్తారు. ఆ సమయంలో ఏటీఎం నుంచి నోట్లు బయటకు వచ్చినా.. అవి క్యాసెట్ మధ్యలో ఉండగానే పవర్ ఆపేయడం వల్ల లావాదేవీని తప్పుగా చూపుతుంది. సంబంధిత ఖాతాదారుకు నగదు విత్ డ్రా అయినట్లు సమాచారం వెళ్లినా వెంటనే తిరిగి ఆ మొత్తం జమ అయినట్లు సంక్షిప్త సందేశం కూడా వెళ్తుంది. ఈలోగా వారు క్యాసెట్ మధ్యలో ఉండిపోయిన నోట్లను లాగేస్తారు. ఇలా వేర్వేరు ఏటీఎంల నుంచి ఈనెల 2 - 5 తేదీల మధ్య 95 సార్లు సొమ్ము విత్‌డ్రా చేశారు.