South Coast Railway Zone operations: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే.. దక్షిణ కోస్తా రైల్వేజోన్ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాల కోసం 106 కోట్ల 89 లక్షలను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకు కోసం జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇప్పటికే భూమిని గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. సర్వే, లేఅవుట్ ప్లాన్, సిబ్బంది నివాస కాలనీ, ఇతర అవసరమైన నిర్మాణాలకు సంబందించిన ప్రాథమిక పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. భవనాల నిర్మాణానికిగాను ప్రాథమిక అవగాహనా ప్రణాళికను సిద్దం చేశామన్నారు.
2022-23 ఏడాదిలో జోన్ ఏర్పాటు కోసం 7.29 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. జోన్ కోసం ఇప్పటికే డీపీఆర్ సిద్దమైందని, ప్రయాణికుల ట్రాఫిక్ సులభంగా కొనసాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా... పరిధి సమస్యలు తలెత్తుకుండా కమిటీని నియమించగా... నివేదిక అందించినట్లు రైల్వే అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు భాగస్వామ్యంతో.. 17,073 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో 07 ప్రాజెక్టులను రైల్వే చేపట్టిందని, వీటిపై ఇప్పటివరకు 7,732 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు.